రూ.400 కోట్ల దారి దోపిడీ కేసు.. చివరికి ట్విస్ట్‌ ఏంటంటే? | Complaint About Theft Of Rs 400 Crore Fake: Nashik Police | Sakshi
Sakshi News home page

రూ.400 కోట్ల దారి దోపిడీ కేసు.. చివరికి ట్విస్ట్‌ ఏంటంటే?

Feb 17 2026 8:54 AM | Updated on Feb 17 2026 9:35 AM

Complaint About Theft Of Rs 400 Crore Fake: Nashik Police

బెళగావి: సుమారు ఐదు నెలల నుంచి సినిమాను మించి ట్విస్ట్‌లతో సాగిన రూ. 400 కోట్ల నగదు దోపిడీ కథ.. చివరికి ఫేక్‌ అని తేలింది. ట్రక్‌ కంటైనర్లలో గోవా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు రూ.400 కోట్ల నగదు.. దోపిడీ జరిగిందంటూ ట్రక్‌ డ్రైవర్‌ చేసిన ఫిర్యాదు.. కట్టుకథగా నాసిక్‌ పోలీసులు తేల్చిపారేశారు. డ్రైవర్‌ చెప్పింది నిజం కాదని.. దారి దోపిడీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

నగదు తరలిస్తున్న ట్రక్కును అడ్డగించి దోపిడీ చేశారంటూ డ్రైవర్‌ సందీప్‌ గత ఏడాది డిసెంబరు 17న మహారాష్ట్రలోని నాసిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది అక్టోబరు 22న బెళగావి జిల్లాలోని చోర్లా ఘాట్‌ ప్రాంతంలో ఈ  చోరీ జరిగిందంటూ నమ్మబలికాడు. కొందరు వ్యక్తులు తనను అడ్డగించి.. దాడి చేశారని.. రూ.400 కోట్ల విలువైన రూ.2000 నోట్లతో (రద్దయిన నోట్లు) పరార్‌ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సందీప్‌.. తనపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను కూడా షేర్ చేశాడు.

ఈ కేసును ఛేదించడానికి మహారాష్ట్ర పోలీసులు.. కర్ణాటక, గోవా పోలీసుల సాయంతో విచారణ చేపట్టారు. అంత భారీ నగదును తీసుకెళ్లే ట్రక్కులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. సందీప్‌ ఫిర్యాదు మేరకు ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారించామని.. అతని ఆరోపణలు కట్టు కథలేనని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్‌ సందీప్ పాటిల్ చెప్పిన వివరాల్లో అనేక పొంతన లేని విషయాలను సిట్‌ గుర్తించింది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురినీ న్యాయస్థానం ఇప్పటికే విడుదల చేసింది. తప్పుడు ఫిర్యాదు చేసిన డ్రైవర్‌ సందీప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే యెచనలో పోలీసులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement