Cop Killed Odisha Minister Was Being Treated For Mental Illness - Sakshi
Sakshi News home page

ఒడిషా మంత్రి కాల్చివేత: అతనొక మానసిక రోగి, అయినా సర్వీస్‌ రివాల్వర్‌తో డ్యూటీ?

Published Mon, Jan 30 2023 7:58 AM | Last Updated on Mon, Jan 30 2023 9:02 AM

Cop Killed Odisha Minister Was Being Treated For Mental Illness - Sakshi

ఒడిషా చరిత్రలో నెత్తుటి మరక చోటు చేసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిశోర్‌ దాస్‌(61)పై తుపాకీ కాల్పులు జరిగాయి. దీంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిన ఆయనను.. ఝార్సుగుడ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉన్నత చికిత్స కోసం హెలీకాఫ్టర్‌లో భువనేశ్వర్‌ తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మంత్రి మృతికి కారణమైన ఏఎస్‌ఐ గతంలో ఆయన వద్ద గన్‌మెన్‌గా పని చేసినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై రాష్ట్ర హోంశాఖ దర్యాప్తుకు ఆదేశించింది.     

ఝార్సుగుడ:  బ్రజ్‌రాజ్‌ నగర్‌ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తుపాకీ కాల్పులకు గురికావడం కలకలం రేపింది. అభిమానులతో కలిసి ఊరేగింపునకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఆయనపై తుపాకీ తూటా పేలింది. బ్రజ్‌రాజ్‌ నగర్‌ గాంధీ చక్‌ ఔట్‌పోస్ట్‌ ఏఎస్‌ఐ గోపాల్‌దాస్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. మంత్రి ఛాతికి గురిపెట్టి, తుపాకీ పేల్చడంతో బుల్లెట్‌ శరీరంలో ఎడమవైపు దూసుకు పోయింది. బ్రజ్‌రాజ్‌నగర్‌ మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ కొత్త కార్యాలయ భవనాలను ప్రారంభించేందుకు మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న హడావిడిలో గాంధీ ఛక్‌ సమీపంలో తుపాకీ పేలుడు సంభవించింది. గాంధీ చక్‌ ఔట్‌పోస్ట్‌ ఠాణా ఏఎస్‌ఐ తన సర్వీస్‌ రివాల్వర్‌తో అతి సమీపం నుంచి మంత్రి ఛాతీకి గురిపెట్టి కాల్చడంతో మంత్రి అక్కడికక్కడే కుప్పకూలారు. పక్కనే స్థానిక ఐఐసీ ప్రద్యుమ్న స్వొయినిపై సైతం కాల్పులు జరపగా, ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై క్రైంశాఖ దర్యాప్తుకు ఆదేశించారు.  

ఒడిషా ఆరోగ్య మంత్రి నబా కిషోర్‌ దాస్‌ మృతి కేసులో కీలక విషయం వెలుగు చూసింది. ఆయన్ని కాల్చి చంపిన ఏఎస్‌ఐ గోపాలకృష్ణ దాస్‌ మానసిక స్థితి సరిగ్గా లేదని తేలింది. బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్న దాస్‌.. పదేళ్లుగా సైకియాట్రిస్ట్‌ దగ్గర చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే.. అతనికి ఉన్న మానసిక వ్యాధిని పక్కనపెట్టి.. సర్వీస్‌ రివాల్వర్‌ జారీ చేయడంతో పాటు బ్రజరాజ్‌ నగర్‌ పోలీస్‌ పోస్ట్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు ఆయనకు పదేళ్లుగా చికిత్స అందిస్తున్న డాక్టర్‌ చంద్రశేఖర్‌ త్రిపాఠి మీడియాకు వివరాలను వెల్లడించారు. 

పదేళ్ల నుంచి ట్రీట్‌మెంట్‌
పదేళ్ల కిందట గోపాలకృష్ణ దాస్‌ తన దగ్గరకు చికిత్స కోసం వచ్చాడని ఆయన తెలిపాడు. కోపధారి అయిన దాస్‌.. దానిని నియంత్రించుకునేందుకు తన దగ్గర చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు.  అతనికి ఉన్న బైపోలార్‌ డిజార్డర్‌ వ్యాధికి ప్రతీరోజూ మందులు వాడాల్సిందేనని, కానీ, ఏడాదిగా అతను తన దగ్గరికి రాలేదని డాక్టర్‌ త్రిపాఠి వెల్లడించారు.  జార్సుగూడ ఎస్‌డీపీవో గుప్తేశ్వర్‌ భోయ్‌ మాట్లాడుతూ.. దాస్‌కు ఏఎస్‌ఐ హోదాలో బ్రజ్‌రాజ్‌నగర్‌ ఏరియా గాంధీ చక్‌ పోలీస్‌ అవుట్‌పోస్ట్‌కు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పారని, ఆ తర్వాతే లైసెన్స్‌డ్‌ పిస్టోల్‌ జారీ చేసినట్లు వెల్లడించారు. 

ఏఎస్‌ఐ గోపాల్‌కృష్ణ దాస్‌ గత కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భార్య జయంతి దాస్‌ తెలిపారు. వృత్తి రిత్యా కుటుంబానికి దూరంగా(400 కిలోమీటర్ల..) ఉంటున్నాడని ఆమె వివరించారు. మంత్రిపై దాడికి సంబంధించిన సమాచారం టీవీ చానెళ్ల ప్రసారంతో తెలిసిందన్నారు. ‘నా భర్త గత ఏడాదిన్నరగా గాంధీ ఛక్‌ ఔటుపోస్టులో ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్యానికి సంబంధించి మందులు కూడా వాడుతున్నారు. అయితే అతను ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియదు. ఉదయమే కుమార్తెతో, శనివారం రాత్రి కుమారుడితో వీడియోకాల్‌ ద్వారా మాట్లాడారు. కాల్‌ సమయంలో పూర్తిగా సాధారణమైనట్లు కనిపించా’రని ఆమె వివరించారు. ఈ చర్యతో తామంతా షాక్‌కు గురయ్యామన్నారు. నిందితుడు దాస్‌ను ఝార్సుగూడ పోలీసులు ఘటనకు పాల్పడిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. క్రైంబ్రాంచ్‌ దర్యాప్తు చేస్తోందని ఉత్తర రేంజ్‌ ఐజీ దీపక్‌కుమార్‌ ప్రకటించారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.  

మంత్రి దగ్గర కూడా..
నిందిత ఏఎస్‌ఐ గోపాల్‌దాస్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు బ్రజరాజ్‌ నగర్‌ సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌(ఎస్‌డీపీఓ) గుప్తేశ్వర్‌ భొయ్‌ తెలిపారు. గంజామ్‌ జిల్లా జలేశ్వర్‌ఖండికి చెందిన దాస్‌.. బెర్హమ్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. ఆ తర్వాత  జార్సుగూడలో పన్నెండేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. తన సర్వీస్‌ రివాల్వర్‌తో 2 రౌండ్లు కాల్పులు జరిపగా.. ఈ పరిస్థితికి ప్రేరేపించిన కారణాలను ధ్రువీకరించే దిశలో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. గోపాల్‌దాస్‌.. కొన్నేళ్ల క్రితం మంత్రి వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్‌ఓ)గా పనిచేశాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

భువనేశ్వర్‌కు ఎయిర్‌లిఫ్ట్‌.. 
తుపాకీ కాల్పులకు గురైన రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్‌ దాస్‌ను ముందుగా ఝార్సుగుడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాఫ్టర్‌లో భువనేశ్వర్‌కు తరలించారు. మధ్యాహ్నం 2.55 గంటలకు విమానాశ్రయానికి చేరడంతో గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి, అంబులెన్స్‌లో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి చేర్చారు. క్యాపిటల్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించగా, ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్సను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. మంత్రి గుండెల్లోకి బుల్లెట్‌ దూసుకు పోవడంతో ఊపిరితిత్తులు, లోపలి భాగాల పునరుద్ధరణకు చేసిన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రక్త ప్రసరణకు చేసిన ప్రయత్నాలు అనుకూలించ లేదు. ఐసీయూలో అత్యవసర చికిత్స సేవలు ఫలప్రదం కానందున ప్రాణాలు కాపాడటం సాధ్యం కాలేదని అపోలో ఆస్పత్రి వర్గాలు మీడియాకు వెల్లడించారు. దీంతో భారీగా అంతర్గత రక్తస్రావమై, ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసినట్లు డాక్టర్‌ దేవాశిష్‌ నాయక్‌ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం వెల్లడించింది. 

అత్యంత ధనిక మంత్రిగా.. 
ఆరోగ్య శాఖామంత్రి నవ కిషోర్‌ దాస్‌ నవీన్‌ మంత్రి మండలిలో రెండో అత్యంత ధనవంతుడు. 2009 నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఝార్సుగుడ అసెంబ్లీ నియోజకవర్గానికి నిరవధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. 2019 ఎన్నికల ముందు బీజేడీ చేరి, మరోసారి విజయం సాధించారు. పార్టీలో అనతి కాలంలోనే కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 70కి పైగా వ్యక్తిగత వాహనాలు, రూ.కోటి విలువ చేసే మెర్సిడెజ్‌ బెంగ్‌ కారు, ఒక రివాల్వర్, డబుల్‌ బ్యారెల్‌ గన్, రైఫిల్‌ కలిగి ఉన్న కిషోర్‌దాస్‌ సమగ్ర ఆస్తుల విలువ రూ.34 కోట్లుగా గతేడాది ప్రకటించారు. గనుల మైనింగ్‌ ఆనయకు ప్రధాన ఆదాయ వనరు.  

బలమైన నాయకుడిని కోల్పోయాం.. 
1962 జనవరి 7న సంబల్‌పూర్‌లో జన్మించిన నవకిషోర్‌ దాస్‌.. ఎల్‌ఎల్‌.బి, ఎంఏ పూర్తి చేశారు. 1980 దశకంలో విద్యార్థి రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంబల్‌పూర్‌లోని గంగాధర్‌ మెహెర్‌ కళాశాల(ప్రస్తుతం గంగాధర్‌ మెహెర్‌ విశ్వవిద్యాలయం)లో చదువుతున్నప్పుడు, విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. దాస్‌ రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా 4 దశాబ్దాలు కొనసాగింది. ఉన్నత నాయకత్వ లక్షణాలతో అన్ని వర్గాల ఆదరణ చూరగొన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి తొలుత కాంగ్రెస్‌ నుంచి, ఆ తర్వాత బిజూ జనతాదళ్‌ అభ్యరి్థగా శాసన సభ్యుడిగా తుదిశ్వాస వరకు కొనసాగారు. ఆయన మరణంతో పశి్చమ ఒడిశాతో రాష్ట్రం బలమైన ప్రజా నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దాస్‌ ఆకస్మిక మృతి ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటని ప్రకటించారు. ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న కీలక నిర్ణయాలు వైద్య రంగంలో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయన్నారు. పశ్చిమ ఒడిశాలో బీజేడీని బలోపేతం చేయడంలో అతని సహకారం అసాధారణమైనదని, పారీ్టలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు.

గతంలో మంత్రి మహంతిపై.. 
బిజూ జనతాదళ్‌ హయాంలో మంత్రులపై దాడులు జరగడం ఇది రెండోసారి. గతంలో 2014 ఫిబ్రవరి 21న న్యాయశాఖ మంత్రి మహేశ్వర్‌ మహంతిపై తుపాకీ దాడి జరిగింది. ఈ ఘటన పూరీలో చోటు చేసుకుంది. మంత్రి శరీరంలోకి రెండు తూటాలు దూసుకుపోయాయి. అదృష్టావశాతు ఈ దాడి నుంచి మంత్రి ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా మంత్రి నవకిషోర్‌ దాస్‌ తుపాకీ పేలుడుతో మృతిచెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. 2009 నుంచి ఆయన ఝార్సుగుడ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

సీఎం రాజీనామా చేయాలి: కాంగ్రెస్‌  
మంత్రి కిషోర్‌దాస్‌పై తుపాకీ దాడి తదనంతర మృత్యు ఘటన పట్ల రాష్ట్ర కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. దీనిపై బాధ్యత వహిస్తూ సీఎం నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కంటాబంజి ఎమ్మెల్యే సంతోశ్‌ సింగ్‌ సలుజా పార్టీ తరఫున డిమాండ్‌ చేశారు. ఆరోగ్య మంత్రిపై కాల్పులపట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ దారుణమైన ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తోందని, అయితే ఈ విషాద ఘటన రాష్ట్ర ప్రజల భద్రత వ్యవస్థ పట్ల ప్రశ్న లేవనెత్తిందని నిలదీశారు. ప్రభుత్వం తన మంత్రికి భద్రత కల్పించ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి పరాకాష్ట అని, దీనిని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖను నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని మీడియా వింగ్‌ చైర్మన్‌ గణేశ్వర్‌ బెహెరా, జట్నీ నియోజక వర్గం ఎమ్మెల్యే సురేష్‌ కుమార్‌ రౌత్రాయ్‌ డిమాండ్‌ చేశారు.  


ప్రధాని సహా పలువురి సంతాపం
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్‌ దాస్‌ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. కాల్పులకు గురికావడం బాధాకరమన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేశ్‌ లాల్, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. అలాగే పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ ప్రముఖులు మంత్రి మృతిపట్ల సంతాపం ప్రకటించారు.  

అరుణ్‌ బొత్రా నేతృత్వంలో.. 
బ్రజ్‌రాజ్‌నగర్‌లో మంత్రి కిషోర్‌దాస్‌పై ఏఎస్‌ఐ కాల్పులు జరపడంతో మృతికి దారితీసిన ఘటనపై విచారణ జరిపేందుకు ఒడిశా క్రైంబ్రాంచ్‌ బృందం ఆదివారం సాయంత్రం ఝార్సుగుడ చేరుకుంది. ఎస్పీ రమేశ్‌ చంద్ర దొర ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ బృందంలో బాలిస్టిక్, సైబర్‌ నిపుణులు, క్రైంబ్రాంచ్‌ అధికారులు ఉన్నారు. దర్యాప్తును క్రైంశాఖ సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ బోత్రా విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. కాల్పులకు గల కారణాన్ని తెలుసుకోవడానికి, ఘటన జరిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏఎస్‌ఐను విచారించనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement