
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ కరాళనృత్యం మే నెలలో స్పష్టంగా కనిపించింది. దేశంలో సెకండ్‌వేవ్‌లో కరోనా విజంభృణ పెరగడంతో నమోదైన మొత్తం కేసుల్లో 31.67 శాతం కొత్త కేసులు ఒక్క మే నెలలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల్లో తేలింది. 2.8 కోట్లకు మించిన కేసుల్లో 31.67 శాతం అంటే 88.82 లక్షల కొత్త కేసులు మే నెలలో నమోదయ్యాయని గణాంకాల్లో వెల్లడైంది.
దేశంలో ఇప్పటిదాకా 3,29,100 మంది కోవిడ్‌తో ప్రాణాలుకోల్పోగా ఒక్క మే నెలలోనే 1,17,247 మంది చనిపోయారు. అంటే మొత్తం మరణాల్లో 35.63 శాతం మరణాలు ఒక్క మే నెలలోనే సంభవించాయి. రోజువారీగా నమోదైన కొత్త కరోనా కేసుల సంఖ్య సైతం మే నెలలోనే నమోదైంది. మే 7వ తేదీన దేశంలోనే రికార్డుస్థాయిలో 4,14,188 కొత్త కేసులొచ్చాయి. ఒక్కరోజులో అధిక కోవిడ్ బాధితుల మరణాలు సైతం మే నెలలోనే సంభవించాయి. మే 19వ తేదీన ఏకంగా 4,529 మంది కోవిడ్‌కు బలయ్యారు. మే 10న యాక్టివ్ కేసుల సంఖ్య సైతం గరిష్టస్థాయిలో 37,45,237గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment