Corona 4th Wave: India Daily Covid 19 Cases Rise Amid Fourth Wave Fears - Sakshi
Sakshi News home page

India Covid 19 New Updates: కరోనా ఫోర్త్‌ వేవ్‌ హెచ్చరికలు!.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు

Published Mon, Apr 18 2022 3:39 PM | Last Updated on Mon, Apr 18 2022 7:29 PM

Corona: India Daily Covid 19 Cases Rise Amid Fourth Wave Fears - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల విజృంభణ మళ్లీ మొదలవుతోందా? డెయిలీ కేసుల పెరుగుతుండడం అందుకు నిదర్శనమా? జూన్‌ కంటే ముందే.. ఫోర్త్‌ వేవ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయా?.. అవుననే సంకేతాలు ఇ‍స్తూనే అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.  

భారత్‌లో వరుసగా 11 వారాల పాటు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుల చోటు చేసుకుంది. గత ఒక్కవారంలోనే 35 శాతం కేసులు పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య ఒకేసారి రెండు వేలను దాటేసింది. గత 24 గంటల్లో(సోమవారం బులిటెన్‌ ప్రకారం..) 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు నమోదైన కేసుల సంఖ్య 1,150 మాత్రమే. అంటే కేసుల సంఖ్య ఒక్క రోజులోనే దాదాపుగా 90 శాతం మేర పెరిగింది. 

రోజూవారీ పాజిటివిటీ రేటు చూసుకుంటే.. 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో ఇన్‌ఫెక్షన్‌ల పెరుగుదల ఎక్కువగా నమోదు అయ్యింది. అయితే చాలాచోట్ల కేసులు తగ్గుముఖం పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నా.. కొత్త వేరియెంట్లను తక్కువగా అంచనా వేయొద్దని, కేసులు ఒక్కసారిగా వెల్లువెత్తే అవకాశం లేకపోలేదని, ఈ పెరుగుదలను ఫోర్త్‌ వేవ్‌కి సంకేతాలుగా భావించి అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

కేసుల్ని పరిశీలించండి
వైరస్‌ తీవ్రత లేదన్న ఉద్దేశం, వ్యాక్సినేషన్‌ కారణంగా ప్రభుత్వాలు సైతం కరోనాను పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల టెస్టింగ్‌-ట్రేసింగ్‌ కూడా జరగడం లేదు. ఈ తరుణంలో కరోనా మృతుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరగడం కలవరపరుస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 214 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 62 కేరళ బ్యాక్ లాగ్ మరణాలు ఉన్నప్పటికీ... అంతకు ముందు రోజులో పోలిస్తే రెగ్యులర్‌ కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదు అయ్యాయి. 

ఇప్పటికే కరోనా తీవ్రత తగ్గడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల్ని సడలించడం, పూర్తి ఎత్తేయడం చేశాయి. దీంతో మాస్క్‌ ల్లేకుండా జనాలు స్వేచ్ఛగా సంచరించడం పెరిగింది. ఇదే కేసులు పెరగడానికి కారణం అవుతుందని ఎయిమ్స్‌ వైద్యులు భావిస్తున్నారు. ఈ తరుణంలో.. కేసుల పెరుగుదలపై దృష్టిసారించాలని వైద్య నిపుణులు రాష్ట్రాలకు కీలక సూచన చేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కవచంగా భావించే ‘మాస్క్‌’ ధరించడాన్ని రూల్‌ తప్పనిసరి అమలు చేయాలని వాళ్లు కోరుతున్నారు.  

మాస్క్‌ మళ్లీ తప్పనిసరి
యూపీలో కరోనా కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. ఈ తరుణంలో గౌతమ్‌ బుద్ధ నగర్‌లో 65, ఘజియాబాద్‌లో 20, లక్నోలో 10 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఆరు జిల్లాల్లో మాస్క్‌ తప్పనిసరి నిబంధనను మళ్లీ తీసుకొచ్చింది యూపీ ప్రభుత్వం. ఇక తెలంగాణలోనూ మాస్క్‌ను తప్పనిసరి చేయబోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నా.. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఫోర్త్‌వేవ్‌ హెచ్చరికలు!
ఇదిలా ఉండగా.. ఈ పరిస్థితులు ఫోర్త్‌ వేవ్‌కి దారి తీస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేమన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. .అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని గుర్తు చేస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో 517 కేసులు నమోదు అయ్యాయి. గత పదిహేను రోజుల్లో క్లోజ్‌ కాంటాక్ట్‌ 500 శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఘజియాబాద్‌, నోయిడా రీజియన్‌లోనూ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. విద్యార్థులతోనే కరోనా విజృంభిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూల్స్‌ మూతపడుతున్నాయి. 

దేశంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 4,30,44,280కి చేరుకోగా... మరణాల సంఖ్య 5,21,965గా నమోదు అయ్యింది. ప్రస్తుతం దేశంలో 11,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 2,66,459 డోసుల వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 1,86,54,94,355 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

సంబంధిత వార్త: మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement