న్యూఢిల్లీ: భారత్‌లో సోమవారం కొత్తగా 52,050 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. గత 24 గంటల్లో 803 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోలుకున్న వారి సంఖ్య 12,30,509కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,298గా ఉంది. గత ఆరు రోజులుగా వరుసగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజా 803 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 266 మంది మరణించారు. కర్ణాటక నుంచి 98, ఆంధ్రప్రదేశ్ నుంచి 63, పశ్చిమబెంగాల్ నుంచి 53, ఉత్తర ప్రదేశ్ నుంచి 48, ఢిల్లీ నుంచి 17, తెలంగాణ నుంచి 23, గుజరాత్ నుంచి 22 మంది మరణించారు. ఆగస్టు 2 వరకు 2,08,64,750 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 6,61,892 శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. జూలైలో ఏకంగా 1,05,32,074 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 66.31 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.10 శాతానికి పడిపోయిందని తెలిపింది.
10 రాష్ట్రాల్లోనే..
దేశంలోని మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 82 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు. అంతేగాక 50 జిల్లాల్లోనే 66 శాతం కేసులు ఉన్నాయి. మరణించిన వారిలో 50 శాతానికిపైగా 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారని తెలిపారు. 45 నుంచి 60 సంవత్సరాల వయసులో వారిలో 37 శాతం మంది మరణించారని, 26 నుంచి 44 సంవత్సరాల వయసువారిలో 11 శాతం మరణించారని చెప్పారు. మరణించిన పురుషుల శాతం 68గా ఉండగా, మహిళల శాతం 32గా ఉందన్నారు. ప్రతిరోజూ మిలియన్ మందిలో 149 పరీక్షలు జరుగుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment