నైట్‌కర్ఫ్యూలో మైసూరు నగరం, బీదర్‌లో రాత్రి దిగ్భందం
సాక్షి, బెంగళూరు: కన్నడనాట కోవిడ్-19 రెండో దాడి రోజురోజుకీ విస్తరిస్తోంది. మంగళవారం కూడా ఆ మహమ్మారి కోరలు చాచి విరుచుకుపడింది. రాష్ట్రంలో 8,778 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 6,079 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే 67 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తంగా 10.83 లక్షల మందికి కరోనా సోకగా 9.92 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరణాల సంఖ్య 13,008 కి పెరిగింది.
2.29 కోట్లకు టెస్టులు
మంగళవారం 9,195 మందికి కోవిడ్ టీకా వేశారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.77 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అయింది. కొత్తగా 1.21 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 2.29 లక్షల మందికి పరీక్షలను చేపట్టారు.
రాత్రి కర్ఫ్యూ, పగలు రద్దీ
బెంగళూరు, తుమకూరు, బీదర్, మైసూరు, బెళగావి తదితర 8 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ మూడోరోజు దాటింది. రాత్రి పూట ఎవరూ బయటకు రాకుండా పోలీసులు బారికేడ్లను పెట్టి పహారా కాస్తున్నారు. బజారులో పని లేకున్నా ఇంటి నుంచి బయటకు వస్తున్నవారిపై లాఠీలూ ఝళిపిస్తున్నారు. అయితే పగలు యథావిధిగా రద్దీ ఏర్పడుతోంది. బస్టాండ్లు, మార్కెట్లు, కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో రాత్రి కర్ఫ్యూ ఎందుకు అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇది వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment