బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన లిస్టులో 52 మంది కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో కర్నాటకలో పలువురు సీనియర్లకు బీజేపీ అధిష్టానం హ్యాండిచ్చింది. కాగా, 224 అసెంబ్లీ స్థానాలకు గాను 189 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్‌ను మంగళవారం రిలీజ్ చేసింది.
ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అభ్యర్థుల ఎంపికపై కీలక ప్రకటన చేశారు. తాను చిక్‌మంగుళూరు నుంచి బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీ బలంగా ఉందన్నారు. ఏప్రిల్ 20వ తేదీన రెండో లిస్టులో మిగత అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిపారు. బీజేపీ ఎప్పుడూ ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉంటుదని స్పష్టం చేశారు. అందులో భాగంగానే 52 మంది కొత్త అభ్యర్థులకు ఎన్నికల్లో అవకాశం ఇచ్చినట్టు వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక, బీజేపీ అభ్యర్థులపై అరుణ్ సింగ్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించాము. వారిలో 8 మంది మహిళలు, 9 మంది డాక్టర్లు, ఐదుగురు లాయర్లు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ముగ్గురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎనిమిది మంది సామాజిక కార్యకర్తలు ఉన్నారని స్పష్టం చేశారు. కాగా, కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజేంద్రన్‌కు కూడా టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మాజీ బెంగళూరు పోలీసు కమిషనర్ భాస్కర్ రావు.. చామరాజ్‌పేట్ నుంచి పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్ర మంత్రులైన శశికళ జోలాయి, ఆర్ అశోక్, ప్రభో చౌహాన్, శంకర్ మునియాకప్ప, మునిరత్న, ఎస్టీ సోమశేఖర్, వీసీ పాటిల్, వరిటీ వాసురాజ్, ముర్గేష్ నిరాణి, సీసీ పాటిల్, సునీల్ కుమార్, శివరామ్ హెబ్బార్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విశ్వసర్ హెగ్డేకు కూడా టికెట్ దక్కింది.
ఇక, మొదటి లిస్ట్ అభ్యర్థుల్లో లింగాయత్-51, వొక్కలింగ-41, కుర్బా-7, ఎస్సీ-30, ఎస్టీ-16, ఓబీసీ సామాజికవర్గం నుంచి 32 మందికి టిక్కెట్లు ఇచ్చారు. ఇదిలా ఉండగా, రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ నిరాకరించడంతో బెలగావి నార్త్‌లోని సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బెనకే మద్దతుదారులు మంగళవారం సాయంత్రం నిరసనలకు దిగారు. అలాగే, ఎమ్మెల్యే మహదేవప్ప యాదవ్‌కు టిక్కెట్ నిరాకరించడంపై బెళగావిలోని రామ్‌దుర్గ్ నియోజకవర్గంలో ఆయన మద్దతుదారులు నిరసన తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన చిక్క రేవణ్ణకు టికెట్ దక్కింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడంతో బీజేపీ అధిష్టానం ఆయనను ఢిల్లీకి పిలిచి మాట్లాడుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment