సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: గతేడాది ముంబైలో సంభవించిన భారీ పవర్ కట్ వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉందనే వార్తను చదివాం. తాజాగా డ్రాగన్ దేశం మరో నీచానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిన్, కోవాగ్జిన్ టీకాల పంపిణీ కార్యక్రమం అమలవుతోంది. అంతేకాక ఇప్పటికే పలు దేశాలకు కేంద్రం మన వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసిన సంగతి తెలిసిందే.
ఇక చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అంత సమర్థవంతమైంది కాదని ఆ దేశానికి చెందిన పలువురు పరిశోధకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా హ్యాకర్లు సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ల ఐటీ సిస్టమ్‌ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారట. ఈ విషయాన్ని సింగపూర్, టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్‌మాన్ సాచ్స్ మద్దతుగల సైఫిర్మా అనే కంపెనీ వెల్లడించింది. చైనీస్ హ్యాకింగ్ కంపెనీ యాప్ట్10 అలియాస్ స్టోన్ పాండ అనే కంపెనీ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కంపెనీల ఐటి మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ సాఫ్ట్‌వేర్లను హ్యాక్ చేసేందుకు యత్నించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ రేసులో భారత ఫార్మ కంపెనీలను ఢీకొట్టడం.. వాటి మేధో సంపత్తిని నిర్మూలించడం ఈ హ్యాకర్ల ముఖ్య ఉద్దేశం అని సైఫిర్మా వెల్లడించింది.
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆస్ట్రాజెనికాతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లోనే భారీ ఎత్తున ప్రపంచ దేశాలకు ఈ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయనుంది సీరం. ఈ నేపథ్యంలో చైనా యాప్ట్10 సీరంని టార్గెట్ చేసి.. వ్యాక్సిన్‌కు సంబంధించిన డాటాను కొల్లగొట్టేందుకు యత్నించినట్లు సైఫిర్మా తెలిపింది. యాప్ట్10 అనేది చైనీస్ మినిస్ట్రి ఆఫ్ స్టేట్ సెక్యూరిటీతో కలిసి పని చేస్తుందని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ 2018లో వెల్లడించింది.
"సీరం ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే, వారు బలహీనమైన వెబ్ సర్వర్లను నడుపుతున్నారు. వారి పబ్లిక్ సర్వర్లు చాలా బలహీనంగా ఉన్నాయి.. ఇవి హాని కలిగించే వెబ్ సర్వర్లు. యాకర్లు ఈ బలహీనమైన వెబ్ అప్లికేషన్, కంటెంట్-మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది చాలా భయంకరమైనది’’ అని సైఫిర్మా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందన కోరగా.. ఎలాంటి సమాధానం లభించలేదు. అలానే సీరం, భారత్‌బయోటెక్‌లు కూడా దీనిపై స్పందిచలేదు అన్నారు.
భారతదేశం, కెనడా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా,అమెరికాలోని కోవిడ్ వ్యాక్సిన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని రష్యా, ఉత్తర కొరియా నుంచి సైబర్ దాడులు జరిగినట్లు మైక్రోసాఫ్ట్ నవంబర్లో తెలిపింది. ఉత్తర కొరియా హ్యాకర్లు బ్రిటిష్ ఔషధ తయారీదారు అస్ట్రాజెనీకా వ్యవస్థల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని రాయిటర్స్ నివేదించింది.
చదవండి:
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ
ముంబై పవర్‌కట్: డ్రాగన్ పనే!
Comments
Please login to add a commentAdd a comment