న్యాయ నిపుణులతో చర్చలు
పోలీస్ కమిషనర్ దయానంద్ వెల్లడి
జైల్లో మర్యాదలపై దర్యాప్తు
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు దర్శన్‌కు రాచ మర్యాదలు అందించిన సంఘటనపై త్వరలో నివేదిక ఇస్తామని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును శీఘ్రగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేయడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వల్ల కేసు విచారణ త్వరగా పూర్తవుతుంది. ఇక దర్శన్‌కు రాచ మర్యాదలు చేయడంలో జైలు అధికారుల పాత్ర, వారి వైఫల్యం తదితర అంశాలపై డీసీపీ సారా ఫాతిమా, సీసీబీ అదనపు కమిషనర్ చంద్రగుప్త ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో హైదరాబాద్ నుంచి కొన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.
హత్య తరువాత పవిత్రగౌడ ఆరా
రేణుకాస్వామిని హత్య చేశాక పవిత్రగౌడ తనదైన రీతిలో ఫాలో అప్ చేసిందని తెలిసింది. శవాన్ని సుమనహళ్లి రాజకాలువలో పారవేశాక స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో పవిత్రగౌడ స్నేహితురాలి భర్త సీనియర్ వైద్యునిగా పని చేస్తున్నాడు. వెంటనే స్నేహితురాలిని, ఆమె భర్తను ఒక కాఫీ రెస్టారెంట్‌కి పవిత్ర పిలిపించింది. తనకు తెలిసిన వారి బంధువు చనిపోయాడని, కారణాలు ఏమిటని ఆరా తీసింది. ఈ వివరాలను పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
టీవీ చానెళ్లలో ప్రసారం చేయొద్దు
చార్జ్‌షీట్లోని సమాచారాన్ని కన్నడ టీవీ చానల్స్‌లో ప్రసారం చేయరాదని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు చార్జిషీట్ వేయగానే అందులోని అంశాలపై టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో దర్శన్ ఇబ్బందిగా భావించి హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుల గోప్యతను కాపాడాలంటూ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
దర్శన్‌కు పవిత్ర బ్లాక్‌మెయిల్
దర్శన్‌ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్‌తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు.
హీరోయిన్లకు అశ్లీల మెసేజ్‌లు
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రోజూ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. నటి పవిత్రగౌడకే కాకుండా ఇంకా ఇద్దరు హీరోయిన్లకు కూడా అతడు అశ్లీల మెసేజ్‌లు పంపించినట్టు తెలిసింది. రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితునిగా ఉన్న ప్రదోశ్ ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఈ విషయాలు చెప్పినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రేణుకాస్వామిని బెంగళూరులో షెడ్‌కు తీసుకువచ్చి కొట్టేటప్పడు అతని మొబైల్‌ఫోన్‌ని లాక్కుని పరిశీలించగా ఇన్‌స్టా గ్రామ్‌లో గౌతమ్ కేఎస్ పేరుతో చాలామంది మహిళలకు అశ్లీల మెసేజ్‌లు పంపించినట్లు ఉంది. ముఖ్యంగా హీరోయిన్లు రాగిణి ద్వివేది, శుభ పుంజాలకు కూడా అసభ్య మెసేజ్‌లు పంపాడు.
Comments
Please login to add a commentAdd a comment