మైసూరు: కర్నాటకలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) వార్షిక పరీక్షలు మొదలైన తొలిరోజే విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న విద్యార్థిని గుండెపోటు రావడంతో మృతి చెందిన సంఘటన మైసూరు జిల్లాలోని టి.నరిసిపుర పట్టణంలో ఉన్న విద్యోదయ పరీక్షా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. అదే తాలూకాలోని అక్కూరు గ్రామానికి చెందిన అనుశ్రీ (16) అనే 10వ తరగతి విద్యార్థిని పరీక్షకు హాజరైంది. పరీక్ష రాస్తూ 15 నిమిషాల తరువాత ఆమె అలాగే ఒరిగిపోయింది. అక్కడి సిబ్బంది టి.నరిసిపుర ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనుశ్రీ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, రెండు సంవత్సరాలుగా కోవిడ్ వేవ్‌ల వల్ల నామమాత్రంగా జరిగిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) వార్షిక పరీక్షలకు ఈసారి అడ్డంకి తొలగిపోయింది. రాష్ట్రమంతటా సోమవారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా విద్యార్థులు ఉత్సాహంగా తరలివచ్చారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎక్కువ భాగం పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజర్ ఇచ్చారు. రాష్ట్రంలో 8.73 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేయించుకొన్నారు. కొన్నిచోట్ల 50 సంవత్సరాల పైబడిన పెద్దలు కూడా పరీక్ష రాశారు. ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రి బీ.సీ.నాగేశ్, బెంగళూరులో అగ్రహారం, దాసరహళ్ళిలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు గులాబి పుష్పాన్ని అందజేసి ధైర్యంగా పరీక్ష రాయాలని సూచించారు.
హిజాబ్ వద్దని బుజ్జగింపు..
- విద్యార్థులు యూనిఫాంతో పరీక్షకు హాజరైన దృశ్యాలు అన్నిచోట్ల కనిపించాయి. అయితే హుబ్లీ, శివమొగ్గ, కోలారుతో పాటు పలుచోట్ల హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులకు ఉపాధ్యాయులు నచ్చజెప్పారు. దీంతో హిజాబ్‌ను పక్కనపెట్టి పరీక్షలకు హాజరయ్యారు.
- బీదర్ ఓల్డ్ సిటీ కాలేజీ వద్ద కొందరు అల్లరిమూకలు గొడవకు యత్నించగా పోలీసులు వారిని లాఠీలతో చెదరగొట్టారు.
- బెళగావిలో ఓ విద్యాలయంలో హిజాబ్‌తో వచ్చిన విద్యార్థినులకు గులాబీ పువ్వులిచ్చి నచ్చజెప్పారు. కానీ హుబ్లీలో కొందరు విద్యార్థినులు పరీక్ష వద్దని వెళ్లిపోయారు.
- బెంగళూరు రాజాజీనగరలో హిజాబ్ ధరించి డ్యూటీకి వచ్చిన ఉపాధ్యాయురాలిని బీఇఓ రమేశ్ వెనక్కి పంపారు.
- బెళగావి జిల్లా చిక్కోడి పట్టణంలోని ఆర్.డీ.కాలేజీ పరీక్షా కేంద్రంలో ఐదుమంది అబ్బాయిలు, ఒక అమ్మాయి ఇతరులకు బదులుగా పరీక్ష రాస్తూ దొరికిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment