ప్రస్తుత ఆధునిక కాలంలోనూ అనేక కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. ఇవి వినేందుకు చాలా వింతగా అనిపిస్తాయి. తాజాగా రాజస్థాన్‌లోని భీల్వాడాలో అటువంటి ఉందంతమే చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువతి తన ప్రియునితో వెళ్లిపోయింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె కోసం వెదుకులాట సాగించి, ఆమెను కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.
అయితే ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడేది లేదని, తాను ఇంటికి తిరిగివెళ్లేది లేదని తెగేసిచెప్పింది. కుమార్తె ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోవడం చూసి, కుటుంబ సభ్యులు ఆమె మరణించినట్లేనని భావిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు గుర్తుగా శోక సందేశాన్ని కూడా ప్రచురించారు. దానిలో కుమార్తె మరణించిన 13 రోజు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసి, బంధువులను ఆహ్వానించారు. కాగా ఈ సంతాప సందేశం సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. ఆమె ఫొటో ముద్రించిన కార్డు వైరల్ అవుతోంది. సజీవంగా ఉన్న కుమార్తె మృతి చెందిదని పేర్కొంటూ, బంధువులను దశదిన కర్మలకు ఆహ్వానించడాన్ని స్థానికులు వింతగా భావిస్తున్నారు.
రతన్‌పురా గ్రామానికి చెందిన ప్రియ జాట్ తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా తనకు ఇష్టమైన యువకునితో వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హమీర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కుమార్తె అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను వెదికి, కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకు వెళ్లబోగా, ఆమె కుటుంబ సభ్యులకు కలిసేందుకు నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కుమార్తె జూన్ 1న చనిపోయిందని పేర్కొంటూ, జూన్ 13న సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వైరల్ అవుతున్న ఈ కార్డును చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment