ఒకప్పుడు కోవిడ్–19కి రాజధానిగా మారుతోందని సాక్షాత్తూ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు కరోనా కట్టడిలో ఢిల్లీ ఒక మోడల్‌గా మారి విజయ దరహాసం చేస్తోంది.
అన్ని రాష్ట్రాల్లో రాజధాని తరహా చర్యలు చేపట్టడానికి కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. పరీక్షలు, రికవరీ, కేంద్ర రాష్ట్రాల సమన్వయం, ప్రజా సహకారం అనే
నాలుగు సూత్రాలతో ఢిల్లీలో కరోనా నియంత్రణలోకి వచ్చింది.
న్యూఢిల్లీ: వైరస్ వ్యాప్తి నెమ్మదిగా మొదలై, చూస్తూ ఉండగానే స్వైర విహారం చేసి, ఆ తర్వాత క్రమేపి తగ్గుముఖం పట్టడం అనేది చాలా చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు దేశ రాజధాని ఆ తగ్గుముఖం పట్టే దశకి వచ్చింది. గత నెలరోజులుగా రోజు వారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అలాగని పూర్తిగా ధీమాగా ఉండే పరిస్థితి లేదు.
కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం, ప్రజల సహకారంతో వైరస్ నియంత్రణలోకి తెచ్చామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటున్నారు కానీ ఆరోగ్య నిపుణుల్లో భిన్నాభిప్రాయాలైతే నెలకొన్నాయి. ‘భారత్‌లో చాలా ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పడుతోంది. అంత మాత్రాన కరోనా నియంత్రణలోకి వచ్చిందని భావించలేం. పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా నెలరోజుల్లో ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించగలిగారు. కానీ ఈ వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు విజృంభిస్తుందో అర్థం కాని పరిస్థితులున్నాయి’ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ సోషల్ మెడిసిన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఏఎం ఖాద్రీ తెలిపారు.
నెలరోజుల్లో ఎంత తేడా !
ఢిల్లీలో మార్చి 2న తొలి కేసు నమోదైన తర్వాత జూన్ 23న ఒకే రోజు అత్యధికంగా 3,947 కేసులు నమోదయ్యాయి. సరిగ్గా నెలరోజులకి జూలై 22న నమోదైన కొత్త కేసుల సంఖ్య 1,349గా ఉంది. నెల రోజుల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో కేసుల్ని నియంత్రించాయి. జూన్‌లో 36% ఉన్న రికవరీ రేటు, జూలై 25 నాటికి 87%కి పెరిగింది. కొత్త కేసులు కూడా తగ్గాయి.
కేసులు ఎలా తగ్గుముఖం పట్టాయంటే..!
► ప్రభుత్వం కోవిడ్‌ను నిర్ధారించే ఆర్‌టీ–పీసీఆర్ టెస్టుల కంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు మూడు రెట్లు ఎక్కువగా చేసింది. రోజుకి 20 వేల వరకు పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ పరీక్షల ద్వారా 18% ఫాల్స్ నెగెటివ్ వచ్చినా చేసిన వారికే మళ్లీ చేయడం ద్వారా రోగుల్ని సకాలంలో గుర్తించి, వెనువెంటనే క్వారంటైన్‌లో ఉంచడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టినట్టుగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ ఆర్. బాబు చెప్పారు.
► నగరాన్ని కంటైన్‌మెంట్ జోన్స్, మైక్రో కంటైన్‌మెంట్ జోన్స్‌గా విభజించి కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం పర్యవేక్షణను పెంచింది. యుద్ధ ప్రాతిపదికన ఆస్పత్రులు ఏర్పాటు చేసి, ఆక్సో మీటర్లను ప్రజలకు అందుబాటులో ఉంచింది.
► వైరస్ సోకి హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి రాకుండా నిఘా ఉంచింది. మొత్తం వెయ్యి మంది వారియర్లను రంగంలోకి దించి నగరంలో కరోనా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించింది.
► అన్నింటికీ మించి కోవిడ్ రోగులకి ప్లాస్మా థెరపీ ఇవ్వడం బాగా పనిచేసింది. దీంతో రికవరీ రేటు 87 శాతానికి పెరిగింది. జాతీయ సగటు (63%) కంటే ఇది చాలా ఎక్కువ. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య జూలై 25నాటికి 12,657కి పరిమితమైంది.
► రక్త పరీక్షల ద్వారా ఇటీవల ఢిల్లీవాసుల్లో దాదాపుగా 30శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టుగా తేలింది. దీంతో ఎక్కువమందిలో వైరస్‌ను తట్టుకునే హెర్డ్ ఇమ్యూనిటే అభివృద్ధి చెందిందని, అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఒక కారణంగా భావించవచ్చునని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment