ఇండిపెండెట్ జర్నలిస్ట్ మన్‌దీప్ పునియా
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ఉద్యమంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు మన్‌దీప్ పునియా అనే జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేశారు. కోర్టు గురువారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. బయటకు వచ్చిన అనంతరం మన్‌దీప్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు నా పట్ల దారుణంగా ప్రవర్తించారు. కానీ నేను భయపడను. అధికారంలో ఉన్న వారి చేతుల్లో అణచివేతకు గురయిన వారి గురించి రిపోర్ట్ చేయడానికి మరలా విధులకు వెళ్తాను’’ అన్నాడు. ఇక జైలులో తాను ఎందరో బాధితులను కలుసుకున్నానని.. వారి బాధలను తన శరీరంపై నోట్ చేసుకున్నానని.. దాని ఆధారంగా ఓ పుస్తకం తీసుకొస్తానని వెల్లడించాడు. 43 ఏళ్ల మన్‌దీప్ పునియా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కార్వాన్ మ్యాగ్‌జైన్ కోసం పని చేస్తున్నాడు.
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులు తనను ఎలా హింసించారో చెప్పుకొచ్చాడు మన్‌దీప్ పునియా. ఆ వివరాలు.. ‘‘సింఘులో రైతులు ఉద్యమం చేస్తోన్న చోట బ్యారికేడ్లకు ఆవతలి వైపున నేను ఉన్నాను. అక్కడ నెలకొన్న పరిస్థితులను వీడియో తీస్తున్నాను. కొందరు వలస కూలీలు అక్కడ నుంచి వెళ్లాలని చూశారు. కానీ పోలీసులు వారిని అడ్డుకోవడమే కాక దూషిస్తూనే ఉన్నారు. నేను ఇదంతా రికార్డ్ చేస్తున్నాను. మా పని మేం చేసుకుంటూ ఉండగా.. పోలీసులు నా పక్కనే ఉన్న జర్నలిస్ట్‌ని పడేశారు. నేను అడ్డుకోవడంతో ఒక పోలీసు ‘‘ఇతడు మన్‌దీప్ పునియా.. ఇతడిని అదుపులోకి తీసుకొండి’’ అన్నాడు. దాంతో వారు నాపై కర్రలతో దాడి చేయడమే కాక దూషించారు. ఆ తర్వాత నన్ను టెంట్‌లోకి తీసుకెళ్లి కొట్టారు. నా మొబైల్, కెమరాను పగలకొట్టారు. ఐడీ కార్డ్ విసిరేశారు’’ అని చెప్పుకొచ్చాడు.
రాత్రి మూడు గంటలకు లాకప్‌లో వేశారు
‘‘ఆ తర్వాత నన్ను వాహనంలో ఎక్కించి రెండు మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో నన్ను మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లారు. అదృష్టం ఏంటంటే ఆ వైద్యుడు నా శరీరంపై ఉన్న గాయాలన్నింటికి చికిత్స చేశాడు. గంట తర్వాత లాకప్‌లో ఉంచారు. వారికి నా పేరు ఎలా తెలిసింది అంటే.. అంతకు ముందే రోజే ఉద్యమం చేస్తోన్న రైతులపై రాళ్లు రువ్వారు. దాని కవరేజ్‌లో భాగంగా నేను పోలీసులతో చాలా సార్లు మాట్లాడాను. అలా తెలిసి ఉంటుంది. ఇక రైతులపై రాళ్లు రువ్విన వారికి.. బీజేపీతో సంబంధం ఉన్నట్లు నేను రిపోర్ట్ చేశాను’’ అన్నాడు.
రైతులను దారుణంగా వారిని హింసించారు
‘‘ఇక జైలులో ఇతర ఖైదీలు నన్ను బాగా చూసుకున్నారు. పోలీసులు నన్ను కొట్టారని తెలుసుకున్నారు. ఇక వారి కష్టాలు నన్ను కదిలించాయి. సిస్టం వల్ల బాధింపబడిన ఓ వ్యక్తిగా జైలు లోపలికి వెళ్లిన నేను నా కన్నా దారుణంగా చిత్ర హింసలకు గురయిన వారిని అక్కడ చూశాను. పోలీసుల దెబ్బలకు వారి పాదాలు నీలం రంగులోకి మారాయి. వారి గురించి బయటి ప్రపంచానికి తెలియజేయడం ఎంతో ముఖ్యమని అప్పుడే నిర్ణయించుకున్నాను. దాంతో ఓ పెన్ను తీసుకుని వారి వివరాలను నా శరీరంపై నోట్ చేసుకున్నాను. త్వరలోనే వీటన్నింటితో ఓ పుస్తకం తీసుకువస్తాను. అధికారంలో ఉన్న వారి వల్ల అణచివేతకు గురయిన వారి గురించి.. వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రపంచానికి వెల్లడించడానికి నేను మళ్లీ కెమరా పడతాను’’ అన్నారు మన్‌దీప్ పునియా.
చదవండి: సయోధ్య సర్కారు విధి
చదవండి: సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment