ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దండయాత్ర చేస్తున్నాయి. దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు తమ జన్మభూమిని వీడుతుండగా.. విదేశాలకు చెందిన వారు తమ స్వదేశాలకు తిరుగు పయణం అవుతున్నారు. ఎన్నో కష్టాలను ఓడ్చి యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్ నుంచి బయటపడుతున్నారు. కాగా, ఇప్పటికే యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఎన్నో జంటలు ఒకటయ్యాయి. బాంబుల దాడులు, కాల్పుల మోతల మధ్యే కొన్ని జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. ప్రేమ ముందు యుద్ధం కూడా చినబోగా.. భారత్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఉక్రెయిన్ అమ్మాయి, భారత్‌కు చెందిన అబ్బాయి ఒకటయ్యారు. తన ప్రేయసి భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే ఎయిర్‌పోర్టులో ప్రపోజ్ చేశాడు ఢిల్లీకి చెందిన హైకోర్టు న్యాయవాది అనుభవ్ భాసిన్. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కపుల్స్ లవ్ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది.
భారత్‌కు చెందిన అనుభవ్ భాసిన్, ఉక్రెయిన్‌కు చెందిన అన్నా హోరోడెట్స్కా ప్రేమించుకున్నారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని.. కొత్త జీవనం కొనసాగించాలనుకున్నారు. ఇంతతో ఊహించని యుద్దం కారణంగా మళ్లీ కలుస్తామో లేదో అన్న ఆందోళనలో ఆమె తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షితంగా భారత్‌లో అడుగుపెట్టింది.
వీరి ప్రేమ గురించి అనుభవ్ భాసిన్ చెబుతూ.. ఉక్రెయిన్‌కు చెందిన అన్నా హోరోడెట్స్కా రెండున‍్నరేళ్ల క్రితం పరిచయమైంది. ఆమె ఓ ఐటీ కంపెనీ పనిచేస్తోంది. అయితే, అన్నా.. భారత్‌కు రాగా కరోనా కారణంగా 2020లో మొదటిసారి లాక్‌డౌన్ కారణంగా విమానాల రద్దుతో ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆమె.. లాక్‌డౌన్ ముగిసే వరకు తన ఇంట్లోనే ఉందన్నాడు.తర్వాత వారు మళ్ళీ దుబాయ్‌లో కలుసుకున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించిదన్నాడు. ఆ తర్వాత ఆమె భారత్‌కు వచ్చిందని.. తాను కూడా కీవ్‌కు వెళ్లినట్టు తెలిపాడు.
అయితే, గతేడాది డిసెంబర్‌లో ఆమె ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నాడు. అనంతరం ఆమె తిరిగి ఉక్రెయిన్ వెళ్లిపోయింది. ఇంతలో యుద్ధం ప్రారంభం కావడంతో ఉక్రెయిన్‌ను విడిచే క్రమంలో మూడు రోజులపాటు బాంబ్ షెల్టర్‌లో ఉన్నట్టు వివరించాడు. అనంతరం రైలు మార్గం ద్వారా, కాలినడకతో సరిహద్దును దాటింది. ఎన్నో కష్టాలతో పోలాండ్‌లోని క్రాకోవ్‌కు చేరుకున్నట్టు పేర్కొన్నాడు. అక్కడ తన స్నేహితులు ఆమెకు సాయం చేసిన్టటు చెప్పాడు. చివరగా ఆమె పోలాండ్‌లోని భారత రాయబారం కార్యాలయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాక.. వీసా రావడంతో ఆమె భారత్ చేరుకున్నట్టు తెలిపాడు. ఆమె భారత్‌కు వచ్చిన ఆనందంలో ఎయిర్‌పోర్టులోనే ప్రపోజ్ చేసినట్టు తెలిపాడు. కాగా, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం అన్నాకు ఏడాది గడువుతో వీసా ఉండగా.. ఆమె భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు స్సష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment