దేశరాజధాని ఢిల్లీలో ‘ప్రమాదకర స్థాయి’ వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేడు (సోమవారం) తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన వాయునాణ్యత కారణంగా ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది.
ఇప్పుడు గాలి నాణ్యత కాస్త మెరుగుపడిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులను ఇకపై ఫిజికల్ మోడ్‌లో నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించడం లేదని తెలిపాయి.
కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని అందుకే చిన్న పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. కాగా పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల చేత మాస్క్‌లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు.
ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ
Comments
Please login to add a commentAdd a comment