సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరం ఢిల్లీ అని ఓ అధ్యయనం చెబుతోంది. తీవ్ర కాలుష్యం బారిన పడుతున్న ఢిల్లీ వాసులు తమ ఆయుర్దాయంలో అత్యధికంగా 11.9 ఏళ్లు కోల్పోతున్నారని పేర్కొంది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం ప్రకారం చూసినా దేశ రాజధాని వాసులు సగటు కన్నా 8.5 ఏళ్లు నష్ట పోతున్నారని తెలిపింది. భారత్‌లో ప్రజల ఆరోగ్యానికి కాలుష్యం పెనుముప్పుగా తయారైందని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే భారత్‌లో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పర్టిక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 ఐదు మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్‌గా కాలుష్యం ఉండాల్సి ఉంది. కాలుష్య తీవ్రతలు ఇలానే కొనసాగితే భారతీయుల సగటు ఆయుర్దాయం కన్నా 5.3 ఏళ్లు తగ్గుతుందని తెలిపింది. దేశంలోని మొత్తం 130 కోట్ల మందికి పైగా ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.
చదవండి: చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్లకు మించి కాలుష్యం ఉండే ప్రాంతాల్లో 67.4 శాతం మంది నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. సగటు భారతీయుడి ఆయుర్దాయం కాలుష్యం కారుణంగా 5.3 ఏళ్లు తక్కువగా ఉంటోందని వివరించింది. 2021లో భారత్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరి్టక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 నమోదు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగటు కన్నా 2.6 ఏళ్లు, తెలంగాణ ప్రజలు సగటు కన్నా 3.2 ఏళ్లు కోల్పోతున్నారని తెలిపింది.
జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆయుష్షు ముప్పు లేదని తెలిపింది. దేశంలో హృదయ సంబంధ వ్యాధులతో 4.5 ఏళ్లు, తల్లీ పిల్లల పోషకాహార లోపంతో 1.8 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నట్లు నివేదిక పేర్కొంది. 2013– 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కాలుష్యంలో భారత్ వాటా 59.1 శాతమని తెలిపింది. సగటు కంటే ఎక్కువగా ఆయుర్దాయం కోల్పోతున్న అత్యధిక జనాభా కలిగిన 10 రాష్ట్రాలు వరసగా.. యూపీ, బిహార్, బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment