
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో తాజాగా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికలో దిగ్విజయ్ బరిలోకి దిగడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సోనియా గాంధీ బుధవారం సీనియర్ నాయకుడు, పార్టీకి విధేయుడైన ఏకే ఆంటోనీతో సమావేశయ్యారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపాల్సిన అభ్యర్థిపై గంటన్నరకు పైగా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు అశోక్ గెహ్లాట్ గురువారం సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానంపై ప్రదర్శించిన ధిక్కార వైఖరి పట్ల సోనియాకు గెహ్లాట్ ఫోన్‌లో ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక తన హస్తం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం.
అది దిగ్విజయ్ వ్యక్తిగత నిర్ణయం
దిగ్విజయ్ సింగ్ సాధ్యమైనంత త్వరగా ఢిల్లీకి చేరుకుంటారని, శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో పార్టీ నాయకత్వం ప్రమేయం లేదని వెల్లడించాయి. దిగ్విజయ్ ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా, తాను సైతం బరిలో ఉంటానని సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నానని ఆయన ఇటీవలే తేల్చిచెప్పారు. అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో దిగేందుకు పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) సిద్ధమని ఆయన సన్నిహితుడొకరు బుధవారం చెప్పారు. అధ్యక్ష బరిలో దిగేందుకు తనకు ఆసక్తి లేదని సీనియర్ నేత కమల్‌నాథ్ మరోసారి స్పష్టం చేశారు. తన దృష్టంతా ఏడాదిలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment