లక్నో: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ ఎంత హానికరంగా ఉందో తెలిసివచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో వైద్యుల కొరత ఎంత తీవ్రంగా ఉందో కరోనా సమయంలో అర్థమయ్యింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుండగా.. మన దగ్గర మాత్రం 10,189 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అంటే 6 లక్షల మంది వైద్యుల కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విరుచుకుపడటంతో అరకొరగా ఉన్న వైద్య సిబ్బందిపై అదనపు భారం పడింది. అయినప్పటికి వారు వెనకడగు వేయలేదు. మహమ్మారిపై పోరాటంలో వారే ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’గా నిలిచారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ.. అదనపు గంటలు పని చేస్తూ నిజమైన యోధులుగా నిలుస్తున్నారు. వైద్యం చేయడం ఒక ఎత్తయితే.. మహమ్మారి నుంచి రక్షణ కోసం పీపీఈ కిట్లు, గ్లౌజులు ధరించి గంటలపాటు విధులు నిర్వహించడం మరో ఎత్తు. (చదవండి: కరోనా వైరస్: ఆ విషయంలో మహిళలే బెటర్)
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వైద్యుడు షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశంసలు పొందుతుంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు ముడతలు పడిన తన చేతి ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘కోవిడ్-19 వార్డులో దాదాపు 10 గంటలపాటు గ్లౌజులు ధరించడంతో నా చేతులు ఇలా అయ్యాయి’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో నెటిజనులను ఆకట్టుకుంటుంది. వెలకట్టలేని సేవ చేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఫైజాన్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఐదుగంటలకు ఒకసారి గ్లౌజులు మార్చాలి. ఇందుకు 5-7 నిమిషాల సమయం పడుతుది. కానీ చాలా సార్లు అది వీలుకాదు.. సమయం కూడా దొరకదు. ఎందుకంటే విధుల్లో మీరు ఒక్కరే ఉంటారు. పేషెంట్ దగ్గర ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మీరు వైద్యుడు, వార్డ్‌బాయ్, నర్స్ పాత్రలు కూడా పోషించాల్సి ఉంటుంది. నా షిఫ్ట్ అయిపోయింది.. ఇక నేను వెళ్తాను అనే పరిస్థితి కూడా ఉండదు’ అన్నారు సయ్యద్. (చదవండి: 26 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి)
My hands after doffing #PPE due to profuse sweating in extremely humid climate.#COVID19 #Covidwarrior #Doctor pic.twitter.com/wAp148TkNu
— Dr Syed Faizan Ahmad (@drsfaizanahmad) August 24, 2020
అంతేకాక ‘ఇదంతా ఒక ఎత్తైతే ఇక పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహించడం సవాలు వంటిది. చెమట పట్టి ముఖం మీదకు కారుతుంది. తుడుచుకోలేని పరిస్థితి. మాస్క్‌ను కూడా సరి చేసుకోలేం. ఇక తల మీద క్యాప్‌తో మరింత ఇబ్బంది. మొదట్లో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం అలవాటయ్యింది. నేను సర్జన్‌ని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కోవిడ్ డాక్టర్‌గా విధులు నిర్వహించాల్సిందే’ అన్నారు. ఎంత అలసిపోయినా.. ఇబ్బందులు ఎదుర్కొన్న పేషెంట్ల ప్రాణాలు కాపాడటంతో వాటన్నింటిని మర్చిపోతామన్నారు సయ్యద్.
Comments
Please login to add a commentAdd a comment