వాతావరణ శాఖ వర్షాలపై విడుదల చేసిన మ్యాప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతున్నాయి. వానలతో భారత నేలంతా తడిసి ముద్దవుతోంది. ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లో జలకళ సంతరించుకోగా రైతుల్లో ఆనందం వెల్లివెరుస్తోంది. అయితే కొన్ని చోట్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నారు. మహారాష్ట్రలో వానాకాలం చాలా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ముంబైలో పరిస్థితులు భయానకంగా తయారయ్యాయి. ఇప్పుడు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వానలు భారీగా పడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెండు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్సాలు భారీగా పడుతున్నాయి. కొండకోనవాగువంకలు నీటితో కళకళలాడుతున్నాయి. వరద పోటెత్తుతోంది. హిమనీనదాలకు భారీగా వరద వస్తుండడంతో పర్వత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు వస్తోంది. ఈ వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తరాఖండ్‌లో ఆదివారం కుండపోత వర్సం పడింది. అక్కడ జనజీవనం స్తంభించింది. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృత్యువాత పడగా మరో నలుగురు గల్లంతయ్యారు. తుఫాను ప్రభావంతో మరో రెండు రోజులు వర్సాలు భారీగా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో విపత్తు నిర్వహణ దళం అప్రమత్తమైంది. ప్రత్యేకంగా 28 దళాలను సిద్ధం చేసినట్లు దళం చీఫ్ నవ్‌నీత్ సింగ్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి ఉంది. సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. షిమ్లా జలమయమైంది. ఆ రాష్ట్రంలోని కంగ్డా, బిలాస్‌పూర్, మండీ, సిర్‌మౌర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సహాయ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్, అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాలను కూడా భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో కూడా వర్సాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి. జాతీయ భద్రతా దళాలతో పాటు ఆయా రాష్ట్రాల బృందాలు కలిసి సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment