![Even Corona Mild Symptoms May Impair Fertility In Men - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/11/covid.jpg.webp?itok=woG6E95g)
సాక్షి, ముంబై: ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉండగా కరోనా సోకిన వారిపై చేసిన అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు.
ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా బారిన పడి కోలుకున్న పురుషులపై ఓ రీసెర్చ్ చేశారు. ఇందులో భాగంగా కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటున్నాయని వారు తెలుసుకున్నారు. కాగా, పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్ ఒమెగా జర్నల్ గత వారం ప్రచురించింది. ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు.
ఈ అధ్యయనంలో వైరస్ కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని తాజాగా తేలినట్లు స్పష్టం చేశారు. ఈ అధ్యయనం కోసం 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి వీర్యకణాల నమూనాలను విశ్లేషించినట్లు తెలిపారు. కరోనా బారినపడిన వారితో ఆరోగ్యవంతుల.. వీర్య కణాలను పోల్చగా.. గణనీయంగా కణాల తగ్గినట్లు అధ్యయనంలో గుర్తించారు. కరోనా బాధితుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్1, ప్రోసాపోసిన్ తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. ఇక, కొవిడ్‌కు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. దాంతో పాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఇది చదవండి: భారత్‌లో ఎక్స్‌ఈ స్ట్రెయిన్ కేసులు.. ఎన్‌కే అరోరా కీలక వ్యాఖ్యలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment