లక్నో: సామూహిక అత్యాచారం కేసులో ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ప్రజాపతితోపాటు మరో ఇద్దరు ఆశిష్ శుక్లా, అశోక్ తివారీకి శుక్రవారం జీవిత ఖైదు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల జరిమానాను విధించింది. ఈ కేసులో నిందితులైన వికాశ్ వర్మ, రూపేశ్వర్, అమరేంద్ర సింగ్ అలియాస్ పింటూ, చంద్రపాల్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్ధోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులను విచారించారు. కాగా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో రవాణా, మైనింగ్ శాఖల మంత్రిగా ప్రజాపతి పని చేశారు.
కాగా మాజీ మంత్రి, అతని ఆరుగురు అనుచరులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చిత్రకూట్‌కు చెందిన ఓ మహిళ 2017 ఫిబ్రవరి 18న యూపీలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి తాను పని కోసం లక్నోలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లినప్పుడు వీరంతా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక తన కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది. అయితే పోలీసులు తన కేసులో నిర్లక్ష్యం వహించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంత్రిపై గౌతంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అనంతరం 2017 మార్చి 15న మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment