న్యూఢిల్లీ: పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే గేమ్ "సబ్‌వే సర్ఫర్స్". గూగుల్ ప్లేస్టోర్‌లో 100 కోట్లకు పైగా డౌన్‌లోడ్లు సంపాదించుకున్న ఈ గేమ్ గురించి ఓ ఆసక్తికర వార్త అందరినీ అవునా! అని నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ట్విటర్‌లో తెగ వైరలవుతున్న ఈ వార్త సారాంశం ఏంటంటే.. 'ఓ వ్యక్తి కొడుకు రైలు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆయన తన కుమారుడి జ్ఞాపకార్థంగా ఈ గేమ్‌ను రూపొందించాడు'. నిజంగానే సబ్‌వే సర్ఫర్స్ ఆటలో ఓ కుర్రాడు రైలు పట్టాలపై పరుగెడుతూ ఉంటాడు. ఎదురుగా వచ్చే రైళ్లు ఢీ కొట్టకుండా, వెనకాల వచ్చే పోలీసుకు చిక్కకుండా పరుగెత్తుతాడు. ఈ క్రమంలో బంగారు నాణాలను, ప్రత్యేక బహుమతులను దక్కించుకుంటూ వెళ్తాడు. దీంతో నిజంగానే చనిపోయిన కొడుకు గుర్తుగా ఈ ఆట రూపొందించి ఉంటారని చాలామంది భ్రమపడుతున్నారు. (అమ్మాయ్.. ఎన్ని మార్కులొచ్చాయ్?)
అయితే అది పూర్తిగా తప్పని రుజువైంది. ఈ అసత్య వార్తను మొదటి సారిగా ఎడోర్‌బెస్ట్‌లాడ్స్ జూలై 29న ట్వీట్ చేశారు. కానీ అంతలోనే నాలుక్కరుచుకుంటూ, తాను చెప్పినదాంట్లో నిజమెంతుందో తెలీదంటూ మరుసటి రోజే దాన్ని డిలీట్ చేస్తూ క్షమాపణ కోరారు. అయితే అప్పటికే అనేకమంది దీన్ని రీట్వీట్ చేస్తూ తెగ ప్రచారం చేశారు. దీంతో సబ్‌వే సర్ఫర్స్ సహ వ్యవస్థాపకులు సీబో(SYBO) ఈ వార్తను కొట్టిపారేశారు. వీధి సంస్కృతికి నివాళిగా కొత్తదనంతో ఈ ఆటను రూపొందించామని స్పష్టం చేశారు. సురక్షితమైన వాతావరణంలో ఇది సృజనాత్మకతతో పాటు వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ ఆటను ఆదరిస్తున్నవాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. (ఆడపిల్ల ఉంటే రూ.24 వేలు: నిజమేనా?)
నిజం: రైలు ప్రమాదంలో మరణించిన కొడుకు గుర్తుగా సబ్‌వే సర్ఫర్స్ రూపొందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment