కొడుకు మృతదేహం కోసం తవ్వుతున్న వాగే (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
శ్రీనగర్: ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులను వదిలించుకునే సంతానం కోకొల్లలు.. బిడ్డలను వదిలేసే తల్లిదండ్రులు మాత్రం ఇంకా తయారు కాలేదు. తమ చివరి క్షణం వరకు బిడ్డల బాగోగుల గురించే ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో హత్యకు గురైన తన కొడుకు మృతదేహం కోసం ఓ తండ్రి గత ఎనిమిది నెలలుగా ప్రతి రోజు తవ్వకాలు జరుపుతూ గాలిస్తూనే ఉన్నాడు. ఈ తండ్రి కన్నీటి వ్యథ ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. ఆ వివరాలు.. షకీర్ మంజూర్(25) అనే వ్యక్తి ప్రాదేశిక సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 2న అతడిని కొందరు ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారం రోజులకు రక్తంలో తడిసిన షకీర్ దుస్తులు లభించాయి. దాంతో అతడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు నిర్థరాణకు వచ్చారు.
బిడ్డను పొగొట్టుకున్నారు.. కనీసం తనని కడసారిగా చూసుకుని.. ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలి అని షకీర్ తల్లిదండ్రులు భావించారు. కానీ నేటికి కూడా అతడి మృతదేహం వారికి లభించలేదు. ఈ సందర్భంగా షకీర్ తండ్రి మంజూర్ అహ్మద్ వాగే మాట్లాడుతూ.. ‘‘ఆగస్ట్ 2న ఈద్ సందర్భంగా నా కుమారుడు మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంటకు మాకు కాల్ చేశాడు. ‘‘నేను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నాను. నా గురించి ఆర్మీ అధికారులు అడిగితే ఏం చెప్పకండి’’ అన్నాడు. అదే తన చివరి కాల్. అప్పటికే తను కిడ్నాప్ అయ్యాడని.. ఉగ్రవాదులే తనతో అలా మాట్లాడించారని ఆ తర్వాత మాకు అర్థం అయ్యింది’’ అన్నాడు వాగే.
‘‘మరుసటి రోజు షకీర్ వాడే వాహనం పూర్తిగా కాలిపోయి కనిపించింది. వారం రోజుల తర్వాత మాకు మా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాధురా ప్రాంతంలో రక్తంలో తడిసిన తన దుస్తులు లభించాయి. తన మృతదేహం కోసం వెదికాం.. కానీ దొరకలేదు. ఈ క్రమంలో ఓ రోజు మా బంధువుల అమ్మాయి రాత్రి తన కలలో షకీర్ కనిపించాడని.. అతడి బట్టలు దొరికన చోటే తనని పాతి పెట్టారని.. వెలికి తీయాల్సిందిగా కోరినట్లు మాకు తెలిపింది. దాంతో మరి కొందరితో కలిసి నేను ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాను. కానీ ఫలితం శూన్యం’’ అన్నాడు వాగే.
‘‘అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు ఇలా తవ్వకాలు జరుపుతూనే ఉన్నాను. ఏదో ఓ రోజు షకీర్ మృతదేహం దొరుకుతుందనే ఆశతో జీవిస్తున్నాను. ఈ విషయంలో గ్రామస్తులు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే వారందరికి తనంటే ఎంతో ప్రేమ. ఇక నా కొడుకును కిడ్నాప్ చేసిన నలుగురు ఉగ్రవాదులు ఎవరో కూడా నాకు తెలుసు. కొన్ని రోజుల క్రితం వారిలో ఒక వ్యక్తి ఇక్కడి అధికారుల నుంచి ఏకే47 రైఫిల్స్ ఎత్తుకెళ్లి చిన్నపాటి గ్రూపును రన్ చేస్తున్నాడు. నా కుమారిడి శవాన్ని అప్పగించాల్సిందిగా మేం అన్ని మిలిటెంట్ సంస్థలను సంప్రదించాం. కానీ వారు తమకు ఏం తెలియదన్నారు’’ అన్నాడు వాగే.
పోలీసు రికార్డుల్లో కిడ్నాప్‌గానే నమోదు...
పోలీసు రికార్డుల్లో షకీర్ కిడ్నాప్ అయినట్లు నమోదు చేశారు. మరణించినట్లు ధ్రువీకరించలేదు. ఇక షకీర్‌ని ఎక్కడ సమాధి చేశారనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. స్థానిక పోలీసులు షకీర్ మృతదేహాం కోసం తీవ్రంగా గాలించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా వాగే ‘‘చెట్టంత ఎదిగిన కొడుకును దూరం చేసుకున్నాను. కడసారి చూపుకు నోచుకోలేదు.. తనకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా లేకపోయింది. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి వద్దు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఇక 2020 నుంచి ఉన్నతాధికారులు మిలిటెంట్ల దాడిలో మరణించిన సైనికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. కరోనా వల్లనే ఇలా చేయాల్సి వచ్చింది అంటున్నారు అధికారులు.
అధికారులపై వాగే ఆగ్రహం..
తన కొడుకును అమరవీరుడిగా ప్రకటించకపోవడం పట్ల వాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. "నా బిడ్డ ఒక సైనికుడు, భారతదేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. అధికారులు మొదట తన ప్రాణాలను కాపాడడంలో విఫలమయ్యారు. తరువాత అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమయ్యారు. అతన్ని అమరవీరుడిగా ప్రకటించాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. నా కొడుకును కిడ్నాప్ చేసి చంపారు. నా బిడ్డ వారి చేతిలో చిత్ర హింసలు భరించాడు.. కాని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తిని అమరవీరుడిగా ప్రకటించకపోవడం నాకు మరింత ఆగ్రహం తెప్పిస్తుంది’’ అన్నాడు.
కశ్మీర్లో, గత మూడు దశాబ్దాలలో సుమారు 8,000 మంది తప్పిపోయారు. వారిని భద్రతా దళాలు తీసుకుని వెళ్లారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. అయితే ఒక సైనికుడు అదృశ్యం కావడం మాత్రం ఇదే ప్రథమం.
చదవండి:
నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్: రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం
అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ
Comments
Please login to add a commentAdd a comment