కొయంబత్తూర్: విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ముందుగా అలారం మ్రోగడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అటువంటిది అలారంలోనే సాంకేతిక సమస్య తలెత్తి అది మ్రోగితే ఇక అంతే విమాన సిబ్బందిలో, ప్రయాణికుల్లో ఒకటే టెన్షన్ మొదలవుతుంది. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే వరకూ ఏం జరుగుతుందో అనే ఒకటే భయం ఉంటుంది.
అలారంలో సాంకేతిక సమస్య తలెత్తి అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి 92 మంది ప్రయాణికులతో బయల్దేరిన గో ఫస్ట్ విమానాన్ని తమిళనాడులోని కొయంబత్తూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కొయంబత్తూర్‌లో ఎయిర్‌పోర్ట్ అధికారులు పర్మిషన్ తీసుకుని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అప్పటికే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని ఉన్నారు.
ఆ తర్వాత విమానాన్ని ఇంజనీర్లు తనిఖీ చేయగా ఎటువంటి సమస్య లేదని తేల్చారు. కాగా, అలారం ఎందుకు మోగింది అంటే అందులో ఏదో సాంకేతిక సమస్య రావడంతో అలా జరిగిందని ఇంజనీర్లు స్పష్టం చేశారు. విమానంలో ఎటువంటి ఇబ్బంది లేదని, అలారంలో ప్రాబ్లం వల్లే ల్యాండ్ చేయాల్సిన అవసరం వచ్చిందని ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. విమానంలో ఉండే ట్విన్ ఇంజన్స్ ఓవర్ హీట్‌కు గురైనప్పుడు అలారం మ్రోగడంతో అలర్ట్ అవుతారు విమాన సిబ్బంది. కానీ ఇక్కడ విమానంలో ఎటువంటి సమస్య లేకుండానే అలారం మ్రోగడం ఏంటా అనేది సదరు ఇంజనీర్లకే తెలియాలి. గతవారం గో ఫస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే పక్షి తాకడంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్‌కు రప్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment