సాక్షి, న్యూఢిల్లీ : హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్ చేసేందుకు ఫేస్‌బుక్ అనుమతిస్తోందనే వార్తల నేపథ్యంలో ఫేస్‌బుక్ ఉన్నతోద్యోగి ఒకరు తనపై ఎఫ్‌బీ, ట్విటర్‌లలో బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. తనను చంపుతామని బెదిరించడంతో పాటు కొందరు తనపై అభ్యంతరకర సందేశాలు పోస్ట్ చేస్తున్నారని ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ (భారత్, దక్షిణ మధ్య ఆసియా) అంఖి దాస్ ఢిల్లీ పోలీస్ సైబర్ విభాగంలో ఫిర్యాదు చేశారు. ఆగస్ట్ 14 తర్వాత తనకు ఈ తరహా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్న బాధితురాలు ఐదారుగురు వ్యక్తుల పేర్లను తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారత్‌లో ఫేస్‌బుక్ పక్షపాత ధోరణితో పనిచేస్తోందని అమెరిన్ దినపత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ శుక్రవారం కథనం ప్రచురించిన అనంతరం ఈ వివాదం మొదలైంది.
ఫేస్‌బుక్ తన హేట్ స్పీచ్ పాలసీని పక్కనపెట్టి తన డిజిటల్ వేదికపై బీజేపీ నేతలను విద్వేషపూరిత ప్రకటనలు, మేసేజ్‌లను పోస్ట్ చేసేందుకు అనుమతిస్తోందని వాల్‌స్ట్రీట్ పేర్కొంది. భారత్‌లో బీజేపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలను కొనసాగించేందుకే ఫేస్‌బుక్ ఇలా చేస్తోందని ఆరోపించింది. భారత రాజకీయాలతో కుమ్మక్కైన ఫేస్‌బుక్ హేట్ స్పీచ్ నిబంధనలనే పేరుతో ఈ వ్యాసాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ షేర్ చేశారు. భారత్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్‌లను పాలక బీజేపీ, ఆరెస్సెస్‌లు నియంత్రిస్తున్నాయని కూడా రాహుల్ ఆరోపించారు. కాగా రాజకీయ నేతల స్ధాయితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా హింసను ప్రేరేపించే కంటెంట్‌ను కంపెనీ నిషేధించిందని ఫేస్‌బుక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. చదవండి : బీజేపీకి వత్తాసు : ఎఫ్‌బీ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment