
శాన్‌ఫ్రాన్సిస్కో: విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తొలగించడంలో విఫలమైనట్లు ఓ విచారణలో తేలడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. తమ సేవల్ని మరింతగా మెరుగుపర్చుకుంటామని వెల్లడించింది. క్రౌడ్ సోర్సింగ్ సాయంతో ఈ విచారణను చేపట్టినట్లు అమెరికాకు చెందిన స్వచ్ఛంద దర్యాప్తు సంస్థ ‘ప్రో పబ్లికా’ తెలిపింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌లో విద్వేషపూరితమైన 900 పోస్టుల్ని పరిశీలించినట్లు వెల్లడించింది. ఈ పోస్టుల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు ఉన్నప్పటికీ ఫేస్‌బుక్‌లోని సెన్సర్లు, కంటెంట్ రివ్యూయర్లు అన్నింటినీ తొలగించలేదంది.
అభ్యంతరకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలను గుర్తించడంలో సెన్సర్లు ఫేస్‌బుక్ మార్గదర్శకాలను ఉల్లంఘించాయని పేర్కొంది. ఇలా 49 పోస్టుల తొలగింపులో నిబంధనలు ఎందుకు పాటించలేదో తెలపాలని ప్రోపబ్లికా ఫేస్‌బుక్‌ను కోరింది. దీంతో దాదాపు 22 ఘటనల్లో విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలు తొలగించడంలో విఫలమయ్యామనీ.. ఇందుకు క్షమాపణలు కోరుతున్నట్లు ఫేస్‌బుక్ ఉపాధ్యక్షుడు జస్టిన్ ఒసొఫ్‌స్కై తెలిపారు. తమ సేవల్ని మరింత మెరుగుపర్చుకోవడంలో భాగంగా 2018లో ఈ విభాగంలో 20 వేల మంది కంటెంట్ రివ్యూయర్లు, ఇతర ఉద్యోగులను తీసుకుంటామన్నారు.