సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్‌గా 1982 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి ప్రమోద్ చంద్ర మోదీ నియమితులయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) మాజీ ఛైర్మన్ అయిన పీసీ మోదీ, తెలుగు వ్యక్తి అయిన పీపీకే రామాచార్యుల స్థానంలో శుక్రవారం సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టిన పీపీకే రామాచార్యులు 72 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి, సెక్రటరీ జనరల్‌గా స్వల్ప కాలం పనిచేసిన వారిలో 2వ వ్యక్తిగా నిలిచారు. అంతకు ముందు 1997 జూలై 25న బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఎస్ సహోని 1997 అక్టోబర్ 2 వరకు ఆ పదవిలో ఉన్నారు.
పీపీకే రామాచార్యులును రాజ్యసభ సెక్రటేరియట్ సలహాదారుగా నియమించారు. సంప్రదాయకంగా ఐఎఎస్ అధికారులు, సీనియర్ పార్లమెంట్ సెక్రటేరియట్ అధికారులకు రిజర్వ్ చేసిన సెక్రటరీ జనరల్ స్థానంలో ఐఆర్‌ఎస్ అధికారి పీసీ మోదీని నియమించడం గమనార్హం. వచ్చే ఏడాది ఆగస్ట్ 10 వరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా మోదీ కొనసాగనున్నారు. ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, తాజా మార్పులపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘రాజ్యసభ సెక్రటరీ జనరల్ పదవికి తగిన వ్యక్తి డాక్టర్ పీపీకే రామాచార్యులు, అటువంటి అనుభవశాలి, నిష్పాక్షికంగా వ్యవహరించే వ్యక్తిని తొలగించడం మాకు ఆశ్చర్యం కలిగించలేదు. మోదీ ప్రభుత్వం పాల్పడిన మూడు ఘోర పాపాల్లో ఇదొకటి’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment