
న్యూఢిల్లీ: దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల రాసిన బహిరంగ లేఖలో మాజీ సివిల్ సర్వీస్ అధికారులు చేసిన ఆరోపణలను మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ మాజీ అధికారులు తీవ్రంగా ఖండించారు. వారి లేఖ రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నమని మండిపడ్డారు. కానిస్టిట్యూషన్ కాండక్ట్ గ్రూప్(సీసీజీ) పేరిట 108 మంది మాజీ సివిల్ సర్వీసు అధికారులు రాసిన లేఖలో నిజాయతీ లేదని తేల్చిచెప్పారు.
మోదీకి అండగా నిలుస్తున్న ప్రజల పట్ల వారి ఆక్రోశం ఇందులో వ్యక్తమవుతోందన్నారు. ఈ మేరకు ‘కన్సర్న్‌డ్ సిటిజెన్స్’ పేరిట 8 మంది మాజీ న్యాయమూర్తులు, 97 మంది మాజీ ఉన్నతాధికారులు, 92 మంది మాజీ సైనికాధికారులు ప్రధాని మోదీకి తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీసీజీ లేఖలోని ఆరోపణలను ఇందులో తిప్పికొట్టారు. సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు కన్వల్ సిబల్, శశాంక్, ‘రా’ మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి తదితరులు ఇందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో విద్వేష బీజాలు నాటే కుతంత్రలు సాగవని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment