గువాహతి: నేరస్తుల ఇళ్లను, వాళ్లకు సంబంధించిన ఇతర స్థిర ఆస్తులను బుల్డోజర్లతో నేలమట్టం చేసే సంస్కృతిపై గువాహతి(అస్సాం) హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు కేసు దర్యాప్తులో ఉండగా.. నిందితులపై అలాంటి చర్యలు తీసుకోమని ఏ చట్టం చెబుతోందని గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడి పోలీస్ శాఖను నిలదీసింది ఉన్నత న్యాయస్థానం.
పోలీస్ స్టేషన్‌కు తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన ఐదుగురి ఇళ్లను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది గువాహతి హైకోర్టు. చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం ఛాయతో పాటు జస్టిస్ సౌమిత్రి సాయికియా నేృతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. అయితే గురువారం విచారణ సమయంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘‘ఏ చట్టం ఇలా బుల్డోజర్లతో ఇళ్లు కూల్చమని చెబుతోంది’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘ కేసు దర్యాప్తులో ఉండగా.. పోలీసులు ఎటువంటి ఆదేశాలు లేకుండా ఒక వ్యక్తి ఆస్తులపై బుల్‌డోజర్ ప్రయోగించవచ్చని మీరు (ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ఏదైనా చట్టంలో చూపిస్తారా?’’ అని ప్రశ్నించింది. మెకాలే తీసుకొచ్చిన నేర విచారణ చట్టంలోనూ దాని ప్రస్తావన లేదు కదా! అని నిలదీసింది. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరపున న్యాయవాది వివరణ ఇచ్చే యత్నం చేస్తుండగా.. సీజే ఛాయ కలుగజేసుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘‘ఆయన ఒక ఎస్పీనే కావొచ్చు. కానీ, అధికారి అలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు అసలు?. ప్రజాస్వామిక పద్ధతిలో ఉన్నాం మనం. సెర్చ్ వారెంట్ జారీ చేయకుండా అలా చేయడం ఏంటి?. పోలీస్ విభాగానికి పెద్ద అయినంత మాత్రాన.. ఎవరి ఇల్లు అయినా పడగొడతారా?.. ఇలాంటి చర్యలకు అనుమతి ఇస్తే.. దేశంలో ఎవరూ భద్రంగా ఉండరు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు.. హిందీ సినిమాల్లోనూ ఇలాంటివి చూడలేదని వ్యాఖ్యానించారాయన.
సినిమాల్లోనూ ఇలాంటి కూల్చివేత సీన్‌లు చూపించేప్పుడు సెర్చ్ వారెంట్ అనేది చూపిస్తారు. కానీ, ఇక్కడ అలాంటిదేం జరగలేదు. మీ కథలేమైనా ఉంటే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టికి ఇవ్వండి.. ఆయన వాటిని సినిమాలుగా తీస్తాడేమో అంటూ సీజే చురకలంటించారు.
కూల్చేసిన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఓ తుపాకీని కోర్టులో సమర్పించగా.. ఇది పోలీసుల పని అయ్యి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. ‘‘ఈ విషయాన్ని డీజీపీకి తెలియజేయండి, లేకుంటే ఈ సమస్య పరిష్కారం కాదు. దయచేసి అర్థం చేసుకోండి.. ఇది మీరు శాంతిభద్రతలను నియంత్రించే పద్ధతి కాదు. మీరు ఒకరు చేసిన ఏ నేరానికి అయినా విచారణ చేయవచ్చు. ఒకరి ఇంటిని కూల్చేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? అని బెంచ్ ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేస్తూ.. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ స్పందన కోరింది.
నాగావ్ జిల్లా బటద్రవ పోలీస్ స్టేషన్‌లో సఫికుల్ ఇస్లాం(39) అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. అయితే.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ముస్లింలు మే 21వ తేదీన పోలీస్ స్టేషన్‌కు నిప్పటించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ మరుసటి రోజే ఇళ్లను కూల్చేశారు. స్థానిక ఎస్పీ ఆ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాల సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా తాము ఆ పని చేయాల్సి వచ్చిందని అధికారులు గతంలో వివరణ ఇచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment