న్యూఢిల్లీ: పెరుగుతున్న గోధుమ ధరలను కట్టడి చేసేందుకు నిల్వలపై పరిమితులు విధించినట్లు కేంద్రం తెలిపింది. తక్షణమే అమల్లోకి రానున్న ఈ పరిమితులు 2024 మార్చి వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం(వోఎంఎస్‌ఎస్) విధానం కింద సెంట్రల్ పూల్ నుంచి 15 లక్షల టన్నుల గోధుమలను ఈ నెలాఖరులోగా టోకు వినియోగదారులకు, వ్యాపారులకు అందజేయనున్నట్లు వివరించింది. నిల్వలు సరిపోను ఉన్నందున గోధుమల దిగుమతి విధానాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని తెలిపింది.
గోధుమల ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పంచదార ఎగుమతులకు అనుమతి లేదని వెల్లడించింది. గోధుమల నిల్వలపై కేంద్రం చివరిసారిగా 2008లో పరిమితులు విధించింది. గత నెలతో పోలిస్తే గోధుమల మార్కెట్ ధరల్లో 8% పెరుగుదల నమోదు కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గోధుమ వ్యాపారులు/హోల్ సేలర్లు 3 వేల టన్నుల వరకు, రిటైలర్లు 10 టన్నులు, మిల్లర్లయితే స్థాపిత సామర్థ్యంలో 75% వరకు గోధుమలను నిల్వ ఉంచుకోవచ్చని ఆయన చెప్పారు. వీరు ఎప్పటికప్పుడు నిల్వ సమాచారాన్ని ఆహారం, ప్రజాపంపిణీ శాఖ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment