బెంగళూరు: లష్కరే ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించి నిన్నటికి 12 సంవత్సరాలు పూర్తయ్యింది. నాటి మారణకాండను తల్చుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులర్పించగా.. కర్ణటకలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. బహిరంగ ప్రదేశాల్లోని గోడ మీద లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మద్దతిచ్చే రాతలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాతల వెనక ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. వివరాలు మంగళూరులోని బహిరంగ ప్రదేశంలోని ఓ గోడ మీద గుర్తు తెలియని వ్యక్తులు ‘సంఘీలు, మన్వేదిలను నియంత్రించడానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులను, మిలిటెంట్లను రంగంలోకి దించే పరిస్థితులు తీసుకురాకండి’ అంటూ నలుపు రంగు పెయింట్‌తో గోడ మీద వివాదాస్పద రాతలు రాశారు.
దీని గురించి తెలిసిన వెంటనే పోలీసుల అక్కడికి చేరుకున్నారు. పెయింటర్లను పిలిచి ఈ రాతలను కవర్ చేయించే పని ప్రారంభించారు. సమీప ప్రాంతంలోని సీసీటీవీ కెమరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నం చేసినందుకు గాను ఈ గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదు చేశామన్నారు. ఇక గోడ మీద రాసిన సంఘీలు.. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలని సూచిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో గో వధను నిషేధించే చట్టంతో పాటు వివాహం కోసం మాత్రమే జరిగే మత మార్పిడిలను నిషేధించే చట్టం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నిర్ణయాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోడల మీద ఇలాంటి రాతలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా ముంబై ఉగ్రదాడి జరిగిన నాడే చోటు చేసుకోవడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ( 26/11 ఉగ్రదాడి : రియల్ హీరోలు వీళ్లే..)
ఇక 12 సంవత్సరాల క్రితం ముంబైలో ఉగ్రవాదుల మారణ కాండ కొనసాగించారు. దీనిలో ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినవాడు. నాటి ఘటనలో 166 మంది చనిపోయారు.. 300 మందికిపైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా భారత్‌లో ప్రవేశించిన ముష్కరులు తాజ్‌మహల్ హోటల్ సహా పలు చోట్ల దాడులకు తెగబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment