యాసిడ్‌ పోసి లైటర్‌తో అంటించి కన్నకొడుకు కళ్లముందే భార్యను తగలబెట్టాడు | Greater Noida Woman Burnt Alive over Dowry Demand Husband in Custody | Sakshi
Sakshi News home page

యాసిడ్‌ పోసి లైటర్‌తో అంటించి కన్నకొడుకు కళ్లముందే భార్యను తగలబెట్టాడు

Aug 24 2025 7:42 AM | Updated on Aug 25 2025 4:01 AM

Greater Noida Woman Burnt Alive over Dowry Demand Husband in Custody

గ్రేటర్‌ నోయిడా సమీపంలో దారుణం 

పోలీసుల నుంచి పారిపోయే యత్నం 

కాల్పుల్లో గాయపడి దొరికిన వైనం 

తల్లితో సహా కటకటాల్లోకి

నోయిడా: భర్త రూపంలోని కట్న పిశాచి పైశాచికత్వానికి మరో మహిళ బలైంది. యూపీలో గ్రేటర్‌ నోయిడా పరిధిలోని సిర్సా గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఈ దారుణం శనివారం పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే లక్షల కట్నం చాలదని, మరింత తేవాలని చిత్రహింసలు పెట్టి, చితకబాది, చివరకు యాసిడ్‌ పోసి, ఆపై సజీవదహనం చేసినట్టు వెల్లడైంది! దాంతో ఆ నరరూప రాక్షసుడు కటకటాలపాలయ్యాడు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించి, పోలీసుల తూటా దెబ్బకు గాయపడి మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. అతనితో పాటు, కోడలిని రాచిరంపాన పెట్టిన అత్తను కూడా అరెస్టు చేశారు. 

ధన దాహంతో...
సిర్సా వాసి సత్యవీర్‌ రెండో కొడుకు విపిన్‌కు 26 ఏళ్ల నిక్కీతో 2016లో పెళ్లయింది. లక్షల నగదుతో పాటు స్కార్పియో కారు, విలువైన వస్తువులు కట్న కానుకలుగా ఇచ్చారు. ఇటీవల సత్యవీర్‌ బెంజ్‌ కారు కొనుకున్నాడు. తనకూ అలాంటి మరో కారైనా, మరో రూ.36 లక్షల అదనపు కట్నమైనా తేవాలని నిక్కీని విపిన్‌ హింసించసాగాడు. అందుకు తల్లి దయావతి వంతపాడేది. పెద్ద కొడుకు భార్య అయిన నిక్కీ అక్కడ కంచన్‌కు కూడా వేధింపులు మొదలయ్యాయి. గురువారం రాత్రి నిక్కీని ఇష్టానికి బాది, యాసిడ్‌ పోసి మరీ నిప్పంటించారు.

 అగ్నికి ఆహుతవుతూ మెట్ల నుంచి నిక్కీ పడిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. భర్త, అత్త కలిసి ఆమెను జుట్టుపట్టి కొడుతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని కంచన్‌ రికార్డు చేసి పోలీసులకు అందించింది. తీవ్రగాయాల పాలైన నిక్కీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలొదిలింది. ‘‘నా చెల్లెలిని కొట్టొద్దని వారించినందుకు నన్నూ చితకబాదారు. తన తల, మెడపై విపరీతంగా కొట్టి యాసిడ్‌ పోశారు’’ అంటూ కంచన్‌ వాంగ్మూలమిచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు విపిన్, దయావతిని అరెస్టు చేశారు.

ఎస్సై గన్‌ లాక్కుని... 
సీన్‌ రీకన్‌స్ట్రక్ఛన్‌ కోసం నిక్కీని ఆదివారం మధ్యాహ్నం అతన్ని ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఎస్సై నుంచి పిస్టల్‌ లాక్కొని పారిపోయాడు. వెంటాడుతున్న పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు. దాంతో అతని కాళ్లపై షూట్‌ చేశారు. కుప్పకూలాక అదుపులోకి తీసుకున్నారు.
 

అమ్మను నాన్నే చంపాడు! 
ఆరేళ్ల కుమారుని వాంగ్మూలం 
పాపం పసివాడు! ఆరేళ్ల లేత ప్రాయం. కన్నతల్లిని తన తండ్రే నాయనమ్మతో కలిసి మరీ కర్కశంగా సజీవ దహనం చేస్తుంటే కళ్లారా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకుని ఉండడు! ‘‘అమ్మను నాన్న, నానమ్మ చెంపపై బాగా కొట్టారు. మండిపోయేది అమ్మపై పోశారు. తర్వాత నాన్న లైటర్‌తో నిప్పు పెట్టాడు’’ అంటూ జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పుకుంటూ వెక్కిళ్లు పెడుతున్న ఆ బాలున్ని చూసి కంటతడి పెట్టని వారు లేరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement