
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ పేర్కొన్నారు. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన వ్యూహాలను నిపుణుల బృందాలు రూపొందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రపంచం ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రుల బృందం భేటీలో మంత్రి భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటు, పంపిణీ అంశాలపై ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి : షాకింగ్ : ఆ వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేత
వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్‌ఓ అంచనా
ఈ ఏడాది చివరి నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధమవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 కరోనా వైరస్ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా వాటిలో 10 వ్యాక్సిన్‌లు కీలక మూడవ దశలో ఉన్నాయని వీటి భద్రత, సామర్ధ్యం మనకు వెల్లడి కావాల్సి ఉందని అన్నారు. ఈ వ్యాక్సిన్లు కీలక దశలను దాటుకుని తగినంత డేటాతో రెగ్యులేటర్ల అనుమతి పొందే ప్రక్రియ ముగియాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఈ అంశాల ఆధారంగా చూస్తే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment