వ్యాక్సిన్‌ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్‌ | Haryana minister Anil vij tests positive after 1st Covaxin shot | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్‌

Published Sun, Dec 6 2020 3:43 AM | Last Updated on Sun, Dec 6 2020 3:43 AM

Haryana minister Anil vij tests positive after 1st Covaxin shot - Sakshi

చండీగఢ్‌: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ బయోటెక్, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌  రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ఒక వలంటీర్‌గా తీసుకున్న హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నవంబర్‌ 20న ప్రయోగాత్మకంగా టీకా తొలి డోసు తీసుకున్న ఆయనకు రెండు వారాలు తిరిగిందో లేదో వైరస్‌ సోకినట్టు తేలింది. 67 ఏళ్ల వయసున్న విజ్‌ తనకు కరోనా సోకిన విషయాన్ని శనివారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అంబాలా కాంట్‌ సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని విజ్‌ ట్వీట్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం పానిపట్‌ వెళ్లిన విజ్‌ అక్కడ బీజేపీ నాయకుడిని కలుసుకున్నారు. అతనికి తర్వాత కరోనా వచ్చిందని తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని విజ్‌ తొలుత పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్‌ వచ్చింది. ఆ మర్నాడు కాస్త లక్షణాలు కనిపించడంతో మళ్లీ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

వ్యాక్సిన్‌ తీసుకున్న 42 రోజులయ్యాకే యాంటీ బాడీలు
విజ్‌కు కరోనా సోకిందన్న విషయం తెలియగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ పనితీరుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకోవాలని, మంత్రికి ఇంకా ఒక్క డోసు మాత్రమే ఇచ్చినట్టుగా తెలిపింది. కోవాగ్జిన్‌ రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే వైరస్‌ నుంచి తట్టుకునే యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందుతాయి. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు.  అది తీసుకున్న 14 రోజుల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని అంటే మొత్తంగా వ్యాక్సిన్‌ పని చేయడానికి 42 రోజులు పడుతుంది. ఈ మధ్యలో కోవిడ్‌ నుంచి వ్యాక్సిన్‌ ద్వారా రక్షణ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని మంత్రి విజ్‌ కూడా చెప్పారు. తన ఆరోగ్యం బాగానే ఉందని కాస్త జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement