Haryana Health Minister
-
వ్యాక్సిన్ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్
చండీగఢ్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఒక వలంటీర్‌గా తీసుకున్న హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నవంబర్ 20న ప్రయోగాత్మకంగా టీకా తొలి డోసు తీసుకున్న ఆయనకు రెండు వారాలు తిరిగిందో లేదో వైరస్ సోకినట్టు తేలింది. 67 ఏళ్ల వయసున్న విజ్ తనకు కరోనా సోకిన విషయాన్ని శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంబాలా కాంట్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని విజ్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం పానిపట్ వెళ్లిన విజ్ అక్కడ బీజేపీ నాయకుడిని కలుసుకున్నారు. అతనికి తర్వాత కరోనా వచ్చిందని తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని విజ్ తొలుత పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఆ మర్నాడు కాస్త లక్షణాలు కనిపించడంతో మళ్లీ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజులయ్యాకే యాంటీ బాడీలు విజ్‌కు కరోనా సోకిందన్న విషయం తెలియగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకోవాలని, మంత్రికి ఇంకా ఒక్క డోసు మాత్రమే ఇచ్చినట్టుగా తెలిపింది. కోవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే వైరస్ నుంచి తట్టుకునే యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందుతాయి. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. అది తీసుకున్న 14 రోజుల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని అంటే మొత్తంగా వ్యాక్సిన్ పని చేయడానికి 42 రోజులు పడుతుంది. ఈ మధ్యలో కోవిడ్ నుంచి వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని మంత్రి విజ్ కూడా చెప్పారు. తన ఆరోగ్యం బాగానే ఉందని కాస్త జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని తెలిపారు. -
రాహుల్ గాంధీ నిపా వైరస్ లాంటి వ్యక్తి
చండీగఢ్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిపా వైరస్ లాంటి వ్యక్తి అంటూ హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరికి వచ్చిన వారినందరినీ రాహుల్ నాశనం చేస్తాడని అనిల్ అన్నారు. ‘రాహుల్ నిపా వైరస్ లాంటి మనిషి. పార్టీని సర్వనాశనం చేస్తాడు. దగ్గరైన వారికీ పతనం తప్పదు’ అని అనిల్ అన్న మాటలను ఓ ప్రకటన రూపంలో హరియాణా ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. కాగా, అనిల్ విజ్ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. గతంలోనూ తాజ్ మహల్ ఓ అందమైన సమాధి అనీ, మహాత్మాగాంధీ ప్రభావం వల్ల ఖాదీకి విలువ పెరగకపోగా, రూపాయి విలువ తగ్గిపోయిందని అనిల్ వ్యాఖ్యానించారు. -
'అలాంటి వాళ్లు మా రాష్ట్రానికి రావొద్దు'
చండీగఢ్: హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తినేవారు తమ రాష్ట్రానికి రావొద్దని హుకుం జారీ చేశారు. తమ రాష్ట్రంలో గోపరిరక్షణ చట్టం కట్టుదిట్టంగా అమలవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 'ఆహారం, పానీయపు అలవాట్లు సరిపడవని కొన్ని దేశాలకు మనం వెళ్లం. అలాగే బీఫ్ తినకుండా ఉండలేమని భావించేవారు హర్యానాకు రాకుండా ఉంటే మంచిద'ని అనిల్ విజ్ అన్నారు. బీఫ్ తినే విదేశీయులకు ప్రత్యేక అనుమతి ఇస్తారా అని విలేకరులు ప్రశ్నకు ఆయనీవిధంగా స్పందించారు. అయితే బీఫ్ తినే విదేశీయులకు మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అంతకుముందు ప్రకటించారు. వివాదస్పద ప్రకటనలు చేయడం అనిల్ విజ్ కు కొత్తకాదు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దీనిపై ఆన్ లైన్ పోల్ నిర్వహించాలని గతేడాది ఆయన డిమాండ్ చేశారు. గోసంరక్షణ, గోవధ నిషేధం బిల్లును గతేడాది మార్చిలో గోవా అసెంబ్లీ ఆమోదించింది. గత నవంబర్ నుంచి ఈ బిల్లు అమల్లోకి రావడంతో ఆవుల అక్రమ రవాణా, గోవధ, బీఫ్ తినడంపై నిషేధం కొనసాగుతోంది. గోవధకు పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ఈ బిల్లులో ఉంది.