'అలాంటి వాళ్లు మా రాష్ట్రానికి రావొద్దు'
చండీగఢ్: హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తినేవారు తమ రాష్ట్రానికి రావొద్దని హుకుం జారీ చేశారు. తమ రాష్ట్రంలో గోపరిరక్షణ చట్టం కట్టుదిట్టంగా అమలవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 'ఆహారం, పానీయపు అలవాట్లు సరిపడవని కొన్ని దేశాలకు మనం వెళ్లం. అలాగే బీఫ్ తినకుండా ఉండలేమని భావించేవారు హర్యానాకు రాకుండా ఉంటే మంచిద'ని అనిల్ విజ్ అన్నారు. బీఫ్ తినే విదేశీయులకు ప్రత్యేక అనుమతి ఇస్తారా అని విలేకరులు ప్రశ్నకు ఆయనీవిధంగా స్పందించారు. అయితే బీఫ్ తినే విదేశీయులకు మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అంతకుముందు ప్రకటించారు.
వివాదస్పద ప్రకటనలు చేయడం అనిల్ విజ్ కు కొత్తకాదు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దీనిపై ఆన్ లైన్ పోల్ నిర్వహించాలని గతేడాది ఆయన డిమాండ్ చేశారు. గోసంరక్షణ, గోవధ నిషేధం బిల్లును గతేడాది మార్చిలో గోవా అసెంబ్లీ ఆమోదించింది. గత నవంబర్ నుంచి ఈ బిల్లు అమల్లోకి రావడంతో ఆవుల అక్రమ రవాణా, గోవధ, బీఫ్ తినడంపై నిషేధం కొనసాగుతోంది. గోవధకు పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ఈ బిల్లులో ఉంది.