
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య జరుగుతున్న పోరులో సీఎంకు కాంగ్రెస్ అధిష్టానం అండగా నిలబడింది. సిద్ధూకి గట్టి హెచ్చరికలే పంపింది. జాతి ప్రయోజనాలకు భంగం కలిగించే వ్యాఖ్యలు ఎవరు చేసినా అదుపులో ఉంచాలని హెచ్చరించింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోనే జరుగుతాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ స్పష్టం చేశారు. కేబినెట్ మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు అమరీందర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఆయనను గద్దె దింపేయాలని డిమాండ్ చేసిన మరుసటి రోజే అమరీందర్‌కు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘
అమరీందర్ నేతృత్వంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటాం’ అని ఆయన చెప్పారు. బుధవారం నలుగురు కేబినెట్ మంత్రులు తృప్త్ రాజీందర్æ బజ్వా, సుఖ్‌బీందర్ సర్కారియా, సుఖీందర్ రాంధ్వా, చరణ్‌జిత్ సిగ్ చాన్నితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు డెహ్రాడూన్‌లో హరీశ్ రావత్‌ను కలుసుకుని చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ఆయన కాంగ్రెస్ అధిష్టానం వైఖరిని చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదన్నారు. పార్టీ భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొని సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేశామని, అంతమాత్రాన పార్టీ అంతటినీ ఆయనకు అప్పగించబోమని చెప్పారు.
సలహాదారుల్ని సిద్ధూ అదుపు చేయాలి
సిద్ధూ తన సలహాదారుల్ని నియంత్రించాలని ఇప్పటికే ఆయనకి గట్టిగా చెప్పినట్టుగా రావత్ తెలిపారు. కశ్మీర్‌ను పాక్‌తో పాటు భారత్ కూడా దురాక్రమణ చేసిందంటూ సిద్ధూ సలహాదారుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ఎంత వీఐపీ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీని మించిపోలేడు. వ్యక్తిగత సమస్యల్ని పార్టీ కార్యకలాపాలకు అడ్డంగా తీసుకు రాకూడదు’ అని హరీష్ చెప్పారు. ముఖ్యమంత్రిపై అమరీందర్ సింగ్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నాయకులు తనను వచ్చి కలుస్తారన్న విషయం హరీశ్ రావత్ ముందుగానే సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘పంజాబ్ ప్రభుత్వంపై వారికి కొన్ని భయాలు, ఆందోళనలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై వారికి సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకే ఇలా అంతర్గత పోరాటాలకి బదులుగా ప్రజాసమస్యల గురించి ఆలోచించాలని వారికి చెప్పాను’ అని హరీశ్ రావత్ వివరించారు.