
పంజాబ్ భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుంది. త్వరలోనే సొంత పార్టీని ప్రకటిస్తాను.
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత కుంపటి పెట్టనున్నారు. సీఎం పదవి నుంచి తనను అవమానకర రీతిలో తప్పించిందని రగిలిపోతున్న అమరీందర్ కాంగ్రెస్ పార్టీని సాధ్యమైనంతగా దెబ్బతీసే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. త్వరలో సొంత పార్టీని ప్రకటిస్తానని, రైతు సమస్యలు సానుకూలంగా పరిష్కారమైతే బీజేపీతో పొత్తు ఉంటుందనే ఆశాభావంతో ఉన్నట్లు మంగళవారం వెల్లడించారు.
నవజోత్ సింగ్ సిద్ధూతో తీవ్ర విభేదాల కారణంగా కిందటి నెలలో అమరీందర్ పంజాబ్ సీఎంగా రాజీనామా చేయగా... కాంగ్రెస్ దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని కుర్చీపై కూర్చొబెట్టిన విషయం తెలిసిందే. ‘పంజాబ్ భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుంది. త్వరలోనే సొంత పార్టీని ప్రకటిస్తాను. పంజాబీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాను. ఏడాదికాలంగా మనుగడ కోసం పోరాడుతున్న రైతుల ప్రయోజనాల కోసం కూడా పాటుపడతాను’ అని అమరీందర్ తన మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ‘బీజేపీతో పాటు అకాలీదళ్ చీలికవర్గాలకు చెందిన దిండ్సా, బ్రహ్మపురాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే’ అని కెప్టెన్ తెలిపారు.
చదవండి: ‘మోదీ నిరక్ష్యరాస్యుడు’... ‘అయితే రాహుల్ డ్రగ్స్ అమ్ముతాడు’