లిక్కర్‌ కేసు: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు | High Court Dismissed Kejriwal Petition On His Arrest By Ed | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

Published Tue, Apr 9 2024 4:20 PM | Last Updated on Tue, Apr 9 2024 7:49 PM

High Court Dismissed Kejriwal Petition On His Arrest By Ed - Sakshi

న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్‌ కోర్టు రిమాండ్‌ చేయడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను  అరెస్టు  చేసిందన్న కేజ్రీవాల్‌ వాదనను కోర్టు తోసిపుచ్చింది.

లిక్కర్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కేజ్రీవాల్‌ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు తాజాగా మంగళవారం(ఏప్రిల్‌ 9) దానిని వెలువరించింది.  

ఈ తీర్పులో భాగంగా  లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్‌ స్కామ్‌కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్  కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణం‍తో లిక్కర్‌ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్‌ అరెస్టు సబబేనని పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకు, సీఎంకు చట్టం ఒకటేనని తెలిపింది. 

కాగా, లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో మార్చి 21న  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్‌కు ఏప్రిల్‌ 15 దాకా జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్‌ కీలక నేత మనీష్‌ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..మళ్లీ తీహార్‌ జైలుకే కవిత 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement