
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ విధానంపై బుధవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో హైడ్రామా చోటు చేసుకుంది. వ్యాక్సిన్ విధానంపై చర్చించడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొంటూ పలువురు బీజేపీ ఎంపీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారు విజయ రాఘవన్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ వీకే భార్గవ, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయిసంఘం ముందు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అధ్యక్షత వహించారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం, జినోమ్ సీక్వెన్సింగ్ (వైరస్ వేరియంట్ల జన్యుక్రమ విశ్లేషణ నమోదు)పై సమావేశంలో చర్చించారు.
కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై, రెండు టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచాలన్న నిర్ణయంపై పలువురు విపక్ష ఎంపీలు ప్రశ్నించాలనుకోగా, అధికార బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. దేశంలో టీకా కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అనవసర అనుమానాలు రేకెత్తించడం సరికాదన్నారు. సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వాయిదా వేయాలన్న డిమాండ్‌పై ఓటింగ్ జరపాలని బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలువురు బీజేపీ ఎంపీలు వాకౌట్ చేశారు. దాదాపు అరగంట పాటు ఈ డ్రామా కొనసాగింది. మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో వైద్య, శాస్త్ర, పరిశోధన రంగం చేసిన కృషిని కమిటీ ఈ సందర్భంగా ఘనంగా కొనియాడింది.
చదవండి: వైరల్: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం