రణరంగమైన ఢిల్లీ.. ఎర్రకోట ముట్టడి | High level Meeting By Amit Shah On Farmers Protest In Delhi | Sakshi
Sakshi News home page

రణరంగమైన ఢిల్లీ.. ఎర్రకోట ముట్టడి

Published Wed, Jan 27 2021 5:19 AM | Last Updated on Wed, Jan 27 2021 12:48 PM

High level Meeting By Amit Shah On Farmers Protest In Delhi - Sakshi

ఎర్రకోట వద్ద రైతు సంఘాల జెండా, మత జెండాలను ఎగరేస్తున్న రైతులు

సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని రణరంగంగా మారింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు మంగళవారం ఒక్కసారిగా రాజధానిలోకి అడుగుపెట్టారు. రోడ్లపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేస్తూ ట్రాక్టర్లతో ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట ప్రాకారాలపైకి ఎక్కిన వందలాది రైతులు కోట లోపలికి దూసుకెళ్లారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాన మంత్రి జెండా వందనం చేసే ప్రదేశంలో, సంప్రదాయ విరుద్ధంగా జాతీయ జెండాకు బదులుగా రైతు సంఘాల జెండా, ఒక మత జెండాను ఆవిష్కరించారు. అనుమతించిన సమయానికన్నా రెండు గంటల ముందే ట్రాక్టర్‌ ర్యాలీని ప్రారంభించిన రైతులు అనూహ్యంగా ఢిల్లీలోకి చొచ్చుకురావడం ప్రారంభించారు.

పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసివేస్తూ.. ‘రంగ్‌ దే బసంతి’, జై జవాన్‌ జై కిసాన్‌’అని నినదిస్తూ రాజధాని వీధుల్లో ట్రాక్టర్లు, బైక్‌లు, గుర్రాలపై కవాతు ప్రారంభించారు. పలు చోట్ల స్థానికులు వారిపై పూలు చల్లుతూ స్వాగతం పలకడం కనిపించింది. వాహనాలపై నిల్చుని పలువురు రైతులు ‘ఐసా దేశ్‌ హై మేరా’, ‘సారే జహా సే అచ్చా’తదితర దేశభక్తి పాటలకు నృత్యాలు చేశారు. అయితే, ఆ కాసేపటికే పరిస్థితి విషమించింది. వెనక్కు వెళ్లాలని, అనుమతించిన మార్గంలోనే పరేడ్‌ నిర్వహించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. దాంతో, రైతులు ఢిల్లీలోకి ప్రవేశించే క్రమంలో పలు ప్రాంతాల్లో రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను చెదరగొట్టేందుకు పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు.

ముఖ్యంగా ఐటీఓ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ బారికేడ్లను ధ్వంసం చేస్తూ పోలీసులపైకి పలువురు రైతులు రాళ్లు, కర్రలతో దూసుకెళ్లారు. అక్కడే నిలిచి ఉన్న ఒక కారును, బస్సును ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. ట్రాక్టర్‌ బోల్తా పడడంతో ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఐటీఓ నుంచి వెనక్కు తరమడంతో ట్రాక్టర్లతో రైతులు పెద్ద ఎత్తున ఎర్ర కోటవైపు కదిలారు. ఎర్ర కోటలో సంప్రదాయంగా జెండా వందనం చేసే చోట మత జెండాను, రైతు సంఘాల జెండాను ఎగరేశారు. చింతామణి చౌక్‌ వద్ద ఆందోళనకారులు బారికేడ్లను, అక్కడ నిలిచి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్షరధామ్‌ ఆలయ సమీపంలో నిహంగ్‌(సంప్రదాయ పంజాబీ యోధులు)లు కత్తులతో పోలీసులపైకి దూసుకెళ్లారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధానిలో చోటు చేసుకున్న విధ్వంసంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. తక్షణమే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధానిలో అదనంగా పారా మిలటరీ బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ నిలిపేశారు. ఈ విధ్వంసంపై రైతు సంఘాల నేతలు స్పందించారు. తమ ఆందోళనలోకి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడ్డాయని ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ప్రకటించింది. 


ఉదయమే మొదలైన బారికేడ్ల తొలగింపు 
సింఘు, టిక్రి, ఘాజీపూర్‌ సరిహద్దుల నుంచి రైతులు మంగళవారం ఉదయం నిర్దేశించిన సమయం కన్నా ముందే ఢిల్లీలోకి చొచ్చుకెళ్లడం ప్రారంభించారు. రైతులు తమకు నిర్దేశించిన మార్గాన్ని కాకుండా ఎర్రకోట వైపు బయలుదేరారు. సింఘు సరిహద్దు నుంచి వస్తున్న ఆందోళనకారులను ముబారకా చౌక్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఇరుపక్షాల మధ్య గొడవ తరువాత పోలీసులు తమ బలగాలను ఉపసంహరించుకున్నారు. మరోవైపు ఘాజీపూర్‌ సరిహద్దు నుంచి బయలుదేరిన రైతులను పాండవ్‌నగర్‌ సమీపంలోని నోయిడా టర్నింగ్‌ వద్ద పెద్ద ఎత్తున బ్యారికేడ్లు వేసి ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ బ్యారికేడ్లపైకి ఎక్కిన నిహాంగ్‌లు కత్తులతో పోలీసులపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. నోయిడా టర్నింగ్‌ వద్ద ఆందోళనకారులను ఆపేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులు కూడా పోలీసులపై రాళ్లు విసిరి, అడ్డుగా ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఏకంగా, పాండవ్‌ నగర్‌ పోలీసు పికెట్‌పైకి ట్రాక్టర్‌లను ఎక్కించేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. ఆ తర్వాత వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించి అక్కడినుంచి ఎర్రకోటలోకి ప్రవేశించారు. అయితే ఎర్రకోటపై త్రివర్ణ పతాకం కాకుండా ఇతర జెండాలను ఎగురవేయడం సరికాదని పోలీసులు వారించినప్పటికీ వినకుండా, సిఖ్‌ మత జెండాను ఎగురవేశారు. 

కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీదే తప్పు 
మరోవైపు ట్రాక్టర్‌ ర్యాలీలో చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు తెలిపారు. ట్రాక్టర్‌ పరేడ్‌ కోసం పోలీసులు నిర్దేశించిన మార్గాన్నే కవాతులో పాల్గొన్న 32 రైతు సంస్థలు అనుసరించాయని తెలిపారు. ఎర్రకోటలో జరిగిన ఘటనలకు కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ కారణమని పంజాబ్‌కు చెందిన కిసాన్‌ బచావ్‌ మోర్చా నాయకుడు కృపా సింగ్‌ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారని అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి మేజర్‌ సింగ్‌ పుణెవాల్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, పంజాబ్‌లోని అమృత్‌సర్‌ దగ్గర్లోని వల్లాన్‌ గ్రామంలో ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు.   

అన్నదాతల ముసుగులో తీవ్రవాదులు 
ఢిల్లీలో విధ్వంసంపై బీజేపీ స్పందించింది. ఇన్నాళ్లూ అన్నదాతల ముసుగులో ఉన్నవారంతా తీవ్రవాదులని తేలిందని వ్యాఖ్యానించింది. ‘అన్నదాతల పరువు తీయొద్దు. తీవ్ర వాదులను తీవ్రవాదులనే పిలవాలి’అని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో జరిగిన ఘటనలపై సిగ్గుపడుతున్నానని, దీనికి బాధ్యత తీసుకుంటున్నానని స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు, రైతు నేత యోగేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. ‘నేడు జరిగిన ఘటనలకు సిగ్గుపడుతున్నా. వీటికి బాధ్యత తీసుకుంటున్నా’ అన్నారు. ‘రైతు ఉద్యమానికి కొందరిని దూరం పెట్టాం, వారే ఈ దుశ్చర్యలకు బాధ్యులని తెలుస్తోంది’ అని వివరించారు. ఢిల్లీలో జరిగిన విధ్వంసాన్ని వామపక్షాలు ఖండించాయి.  పరిస్థితి రావడానికి మోదీ ప్రభుత్వమే కారణమని విమర్శించాయి.  

ట్రాక్టర్‌ బోల్తా.. రైతు మృతి
ఐటీఓ మీదుగా రైతుల బృందం ఇండియా గేట్‌ వైపు దూసుకెళ్ళేందుకు ప్రయత్నించింది. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయాల్సి వచి్చంది. ఆందోళనకారుల్లో కొం దరు పోలీసులపై రాళ్ళు రువ్వారు. ట్రాక్టర్లతో పోలీసులపైకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో, అక్కడే ఒక ట్రాక్టర్‌ బోల్తాపడి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక రైతు మృతి చెందాడు. 

అది ‘నిషాన్‌ సాహిబ్‌’ 
ఎర్ర కోటపై రైతు ఆందోళన కారులు ఎగరేసిన కాషాయ జెండా సాధారణంగా అన్ని గురుద్వారాల్లో కనిపించే ‘నిషాన్‌ సాహిబ్‌’అనే మత పతాకం. త్రికోణాకారంలో ఉండే ఈ జెండాను అత్యంత పవిత్రమైనదిగా సిక్కులు భావిస్తారు. దీనిపై రెండు వైపులా పదునున్న ఖడ్గం(ఖండా), చక్రం, రెండు కృపాణాలు ముద్రించి ఉంటాయి. ఎర్రకోటపై ఒక రైతు సంఘానికి చెందిన మరో జెండాను కూడా ఎగరేశారు.  

86 మంది పోలీసులకు గాయాలు
రైతులతో ఘర్షణల్లో 86 మంది పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసు విభాగం ప్రకటించింది. ఢిల్లీ పోలీసులు పూర్తి సంయమనంతో వ్యవహరించారని పేర్కొంది.  ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద గాయపడినవారిలో శిక్షణలో ఉన్న ఒక ఐపీఎస్‌ అధికారి ఉన్నారు. అక్కడే అదనపు డీసీపీ మంజీత్‌ను ట్రాక్టర్‌తో ఢీ కొట్టేందుకు ప్రయత్నించగా, ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్న పోలీసుల్లో దాదాపు సగంమంది రైతుల దాడిలో గాయపడ్డారు. రైతులు నెట్టివేయడంతో వారిలో పలువురు ఎత్తైన గోడపై నుంచి కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఘర్షణలకు సంబంధించి నాలుగు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

ర్యాలీలో ఎప్పుడేం జరిగిందంటే...
ఉదయం 
► 7.009.30: బారికేడ్లను అడ్డుతొలగించుకుంటూ సింఘూ, టిక్రి, ఘాజీపూర్‌ సరిహద్దుల నుంచి వేల సంఖ్యలో ట్రాక్టర్లు, మోటార్‌ సైకిళ్లు, కార్లతో ఢిల్లీలోకి రైతుల ప్రవేశం 
► 10.00: సంజయ్‌ గాంధీ ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌ వద్ద పోలీసులతో గొడవపడిన రైతులు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు  
► 10.30: అక్షరధామ్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద పోలీసులు, రైతులగొడవ. రోడ్లపై ఉన్న వాహనాలను ధ్వంసం చేసిన రైతులు 
► 11.00: టియర్‌ గ్యాస్, లాఠీచార్జ్‌ చేసిన పోలీసులు, కత్తులతో దాడులు చేసేందుకు రైతుల ప్రయత్నం. సరై కాలే ఖాన్‌ వైపు రైతుల కదలిక  

మధ్యాహ్నం 
► 12.00: ముకర్బా చౌక్‌ వద్ద పోలీసులతో రైతుల ఘర్షణ. ఐటీఓ సెక్షన్‌ చేరుకొని వాహనాలను,  బస్సులను ధ్వంసం చేసిన రైతులు. పోలీసులపై దాడులు. పోలీసుల ప్రతిఘటన. ట్రాక్టర్లు బైకులతో పోలీసులను వెంబడించిన రైతులు. అడ్డుగా ఉన్న డీటీసీ బస్సులను ధ్వంసం చేస్తూ ఎర్రకోట వైపు పయనం. ఎర్రకోటపై రైతుసంఘాల జెండా, సిక్కు మత జెండాను ఎగరేశారు. 
► 1.00: ట్రాక్టర్‌ తిరగబడి నవనీత్‌ సింగ్‌ అనే రైతు మృతి. అతన్ని కాల్చేశారని రైతుల ఆరోపణ. ప్రతియేటా ప్రధాని దేశ జెండాను ఎగురవేసే చోటు నుంచి సిక్కు జెండాను తీసేసేందుకు సైనికుల ప్రయత్నం.  
► 2.30: ఐటీఓ ఇంటర్‌సెక్షన్, ఎర్రకోట వద్ద పోలీసులతో కొనసాగిన రైతుల ఘర్షణలు, రాళ్లదాడి. 
► 3:00 తర్వాత: ఎర్రకోట నుంచి రైతులను పంపించివేసిన పోలీసులు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జ్‌ 
► అర్ధరాత్రి వరకూ సింఘు, ఘాజీపూర్, టిక్రి, ముకర్బా చౌక్‌ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement