బల ప్రదర్శన నడుమ.. ఈడీ ముందుకు రాహుల్‌ | High Tension At AICC Head Office Amid ED Questions Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Rahul Gandhi ED Appearance: బల ప్రదర్శన నడుమ.. ఈడీ ముందుకు రాహుల్‌

Published Mon, Jun 13 2022 9:22 PM | Last Updated on Tue, Jun 14 2022 8:34 AM

High Tension At AICC Head Office Amid ED Questions Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ వార్తా పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ (51) సోమవారం ఢిల్లీలో హైడ్రా మా నడుమ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ భారీ బలప్రదర్శనకు, నిరసనలకు దిగింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి ఉదయం 9కల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్రియాంకాగాంధీతో పాటు పలువురు అగ్ర నేతలతో రాహుల్‌ భేటీ అయ్యాక 10.30కు అంతా కలిసి ‘సత్యాగ్రహ యాత్ర’ పేరిట రెండు కిలోమీటర్ల దూరంలోని ఈడీ ఆఫీసుకు కాలినడకన బయల్దేరారు.

రాహుల్‌కు సంఘీభావంగా, కేంద్రానికి, ఈడీకి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘విప్లవం వర్ధిల్లాలి’, ‘పోరాడు రాహుల్, అండగా మేమున్నాం’ అంటూ హోరెత్తిం చారు. ఈడీ, సీబీఐ తదితర కేంద్ర సంస్థలు పంజరంలో చిలకలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులను ప్రతిఘటిస్తూ ముందుకు సాగారు. భారీ భద్రతతో కూడిన రెండు బారికేడ్లను దాటాక మూడో పాయింట్‌ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌సింగ్, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అధీర్‌ రంజన్‌ చౌధరి, ముకుల్‌ వాస్నిక్, జైరాం రమేశ్, సీఎంలు అశోక్‌ గెహ్లాట్, భూపేశ్‌ భగేల్‌ సహా పలువురు నేతలతో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. నేతలను తరలిస్తున్న వాహనాలకు పైకెక్కి నిరసన తెలిపారు.

అక్కడి నుంచి ప్రియాంకతో కలిసి రాహుల్‌ కార్లో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. అక్క డ భారీగా బలగాలను మోహరించారు. మధ్యా హ్నం ప్రియాంక ఈడీ ఆఫీసు నుంచి బయల్దేరి అగ్ర నేతలను తరలించిన తుగ్లక్‌ రోడ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. తనతో పాటు పలువురు నేతలపై పోలీసులు చేయి చేసుకుని గాయపరిచారని అధీర్‌ ఫిర్యాదు చేశారు. రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు, వాటికి కౌంటర్లిస్తూ బీజేపీ నాయకులు రోజంతా పోటాపోటీ ట్వీట్లు చేశారు. రాహుల్‌కు సంఘీభావంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. 

ఇదే తొలిసారి 
రాహుల్‌ ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరవడం ఇదే తొలిసారి. ఈ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్‌ బన్సల్‌లను కూడా ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీని కూడా 23న ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.

సుదీర్ఘ విచారణ
రాహుల్‌గాంధీని ఈడీ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 11.10కు ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరైన ఆయనను మధ్యాహ్నం 2.10 దాకా ప్రశ్నించారు. లంచ్‌ విరామం తర్వాత 3.45 నుంచి రాత్రి 11.10 దాకా విచారణ కొనసాగింది. ముందుగా రాహుల్‌ న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేసి తన హాజరు నమోదు చేశారు. తర్వాత మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్‌ 50 కింద ఆయన స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అనంతరం నేషనల్‌ హెరాల్డ్, దాని ప్రస్తుత యాజమాన్య సంస్థ యంగ్‌ ఇండియాలపై నమోదైన పలు ఆర్థిక అవకతవకల అభియోగాలపై అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి విచారణ జరిపారు.

కాంగ్రెస్‌ ప్రమోట్‌ చేసిన యంగ్‌ ఇండియా వ్యవస్థాపన జరిగిన తీరు, నేషనల్‌ హెరాల్డ్‌ కార్యకలాపాలు, అంతర్గతంగా నిధుల బదిలీ, హెరాల్డ్‌ ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు కాంగ్రెస్‌ ఇచ్చిన రుణం తదితరాలపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. మరో అధికారి స్టేట్‌మెంట్‌ను టైప్‌ చేసి రికార్డ్‌ చేశారు. డిప్యూటీ డైరెక్టర్‌ ర్యాంకు అధికారి పర్యవేక్షించారు. లంచ్‌ విరామంలో ఇంటికి వెళ్లిన రాహుల్‌ అక్కడి నుంచి సోదరి ప్రియాంకతో కలిసి తమ తల్లి, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ కరోనాకు చికిత్స పొందుతున్న గంగారాం ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం విచారణ కోసం 3.30 కల్లా తిరిగి ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. రాత్రి 11.10 దాకా విచారణ కొనసాగించిన అనంతరం మంగళవారం మళ్లీ విచారణకు హాజరవాలని అధికారులు ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement