హిజాబ్ వివాదం ఇప్పుడు మరో రూపం దాలుస్తోంది. హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ ఏర్పాటు కుట్ర జరుగుతోందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ విభాగంతో సంఘ విద్రోహ శక్తులు చేతులు కలపొచ్చని, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు ప్రయత్నించొచ్చని పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది.
పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో అశాంతి రాజేందుకు రంగంలోకి దిగినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక అంచనాకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ఖలీస్థానీ విభాగం ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) హెచ్చరించాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖలకు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు నిఘా వర్గాలు శుక్రవారం ఒక నోట్ ద్వారా సూచించాయి.
ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు రావడం కుదరదంటూ కర్ణాటక రాష్ట్రం అభ్యంతరం చెప్పడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. చదువుకునే చోటు వివాదాలకు, రాజకీయాలకు వేదిక కాకూడదనేది పలువురి అభిప్రాయం. అయితే భారత్ వ్యతిరేక శక్తులు కొన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుతో చేతులు కలపొచ్చని, హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో తాజాగా హెచ్చరించింది.
రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బిహార్, వెస్ట్ బెంగాల్ లోని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు హిజాబ్ రెఫరెండమ్ ఉద్యమాన్ని ముస్లింలు ప్రారంభించాలంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ పిలుపునిచ్చినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఇందుకు కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీఇవ్వడాన్ని సైతం ప్రస్తావించింది. హిజాబ్ రిఫరెండం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫారమ్ కొన్ని స్క్రీన్‌షాట్‌లు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. అంతేకాదు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రసంగం కూడా వైరల్ అవుతున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నోట్ శుక్రవారం వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment