న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ఏడాదే ఉన్న నేపథ్యంలో విపక్షాల ఐక్యత దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. బిహార్‌లో అధికారంలో ఉన్న మహాఘట్‌బంధన్ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్య నేతల మధ్య బుధవారం కీలక సమావేశం జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు.
బీజేపీని కలసికట్టుగా ఎదుర్కోవడంతో పాటు పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. అనంతరం నేతలంతా సంయుక్తంగా మీడియా ముందుకొచ్చారు. విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న మీడియా ప్రశ్నలకు మాత్రం నేతలు సమాధానం దాటవేశారు.మోదీ మేజిక్‌ను ఎదర్కోవడానికి ఒక ఉమ్మడి నాయకున్ని ప్రకటించే ఎన్నికల బరిలో దిగడం మేలని విపక్ష నేతల్లో కొందరంటుండగా అది అంతిమంగా తమకే చేటు చేయవచ్చని మరికొందరు భావిస్తుండటమే దీనికి కారణమని చెబుతున్నారు.
కీలక ముందడుగు: రాహుల్
తమ భేటీని చరిత్రాత్మక సమావేశంగా రాహుల్ అభివర్ణించారు. ‘‘ఈ భేటీ విపక్షాల ఐక్యత దిశగా కీలక ముందడుగు. ఎన్నో అంశాలపై చర్చించుకున్నాం. అన్ని పార్టీలనూ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి లోక్‌సభ ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పట్నుంచే అందరమూ ఆ దిశగా పని చేస్తాం. మాది సైద్ధాంతిక పోరాటం. విపక్షాల ఉమ్మడి విజన్‌ను త్వరలో ప్రజల ముందుంచనున్నాం’’ అని వెల్లడించారు.
ఎన్ని విపక్షాలు కలిసి రానున్నాయని ప్రశ్నించగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలింకా కొనసాగుతున్నాయని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఒక్కటిగా నిలబడ్డాం. దేశం కోసం ఒక్కటిగా పోరాడతాం’’ అంటూ అనంతరం ట్వీట్ చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశానికి నూతన దిశానిర్దేశం చేసేందుకు కలసికట్టుగా సాగుతామని ఖర్గే ప్రకటించారు. నితీశ్, తేజస్వి తదితరులతో భేటీ చాలా బాగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది తొలి సమావేశం.
ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్‌సింగ్, బిహార్‌పీసీసీ చీఫ్ అఖిలేశ్ ప్రసాద్‌సింగ్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా మున్ముందు మరిన్ని విపక్షాలతో ఖర్గే భేటీ కానున్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తదితరులతో ఇటీవలే ఆయన సమావేశమై చర్చించారు. ఇటీవలే ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో 19 విపక్షాలు సమైక్యంగా నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనడం తెలిసిందే.
పార్టీలన్నింటినీ కలుపుకుంటాం: నితీశ్
దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుని పోయేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామని నితీశ్ ప్రకటించారు. ‘‘అంతా కలిసి పని చేయాలని భేటీలో నిర్ణయం తీసుకున్నాం. అందుకోసం అందరమూ కూర్చుని మాట్లాడుకుంటాం. భావి కార్యాచరణను నిర్ణయించుకుంటాం. అది త్వరలోనే జరుగుతుంది. ఆ దిశగా ముందుకు సాగనున్నాం’’ అని వెల్లడించారు. విపక్షాల ఐక్యతను సాధించే కీలక శక్తిగా నితీశ్ నిలవనున్నారంటూ జేడీ(యూ) ట్వీట్ చేసింది.
నితీశ్‌కు పూర్తి మద్దతు: కేజ్రీవాల్
కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం నితీశ్, తేజస్వీ బుధవారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తర్వాత కేజ్రీ మీడియాతో మాట్లాడారు. విపక్షాల సమీకరణకు నితీశ్ ప్రయత్నాలను ప్రశంసించారు. వాటికి తన పూర్తి మద్దతుంటుందని ప్రకటించారు. ‘‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కేంద్రంలో ప్రస్తుతమున్నది బహుశా దేశ చరిత్రలోనే అత్యంత అవినీతిమయ ప్రభుత్వం! దాని దెబ్బకు సామాన్యుని బతుకు దుర్భరంగా మారింది.
బీజేపీ సర్కారుపై విపక్షాలన్నీ సమైక్యంగా పోరాడి దాన్ని కూలదోయడం అత్యవసరం’’ అని అభిప్రాయపడ్డారు. నితీశ్‌ను ప్రధాని అభ్యరి్థగా భావిస్తున్నారా అని ప్రశ్నించగా, కేవలం ఒక్క భేటీతో ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేమని కేజ్రీవాల్ అన్నారు. గురు, శుక్రవారాల్లో మరికొందరు విపక్ష నేతలతో కూడా నితీశ్ భేటీ అవుతారని సమాచారం. మంగళవారం ఆయన ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్‌తోనూ సమావేశమయ్యారు.
బందిపోట్ల కూటమి: బీజేపీ
కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ నేతల భేటీని రాజకీయ గిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. ‘‘అదో బందిపోట్ల కూటమి. నిండా అవినీతిలో కూరుకుపోయిన వాళ్లంతా చట్టం బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలివి. ఇలాంటి విన్యాసాలతో వారి అవినీతి దాగబోదు’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. 2014, 2019 ఎన్నికల్లో వారిని ప్రజలు వరుసగా తిరస్కరించారన్నారు. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని, మోదీ సారథ్యంలో బీజేపీ ఘనవిజయం ఖాయమని జోస్యం చెప్పారు
VIDEO | Bihar CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav meet Congress leader Rahul Gandhi at party president Mallikarjun Kharge's residence in Delhi pic.twitter.com/11bSWF2A5J
— Press Trust of India (@PTI_News) April 12, 2023
Comments
Please login to add a commentAdd a comment