
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే సభలో హైడ్రామా చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హింసను ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. హింసకు సంబంధించిన పోస్టర్లు, ఫోటోలను బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ప్రదర్శించారు. వెల్‌లో బైఠాయించారు.
శాంతించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని గవర్నర్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రసంగాన్ని విరమించి, బయటకు వెళ్లిపోయేందుకు గవర్నర్ సన్నద్ధం కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకున్నారు. బయటకు వెళ్లొద్దంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా నిరసన ఆపాలని గవర్నర్ కోరినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు.
మళ్లీ గవర్నర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, తృణమూల్ ఎమ్మెల్యేలు ఆయనను వారించారు. చేసేది లేక నినాదాల హోరు కొనసాగుతుండగానే గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యుల తీరు పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహార శైలి ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా ఉందన్నారు. బెంగాల్‌లో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలన్నదే వారి కుట్ర అని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండపై మాత్రమే తాము నిరసన తెలిపామని, సభను అడ్డుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment