
న్యూఢిల్లీ: ‘ఇతరులు ఇచ్చే కానుకలు, బహుమానాల వెనుక స్వార్థపూరిత కారణం ఉండొచ్చు. మన నుంచి ఏదో ఒకటి ఆశించి ఇలాంటివి ఇస్తుంటారు. అది స్వీకరించే ముందు ఈ విషయం ఆలోచించాలి’.. ప్రఖ్యాత సైంటిస్ట్, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బాల్యంలోనే తన తండ్రి వద్ద నేర్చుకున్న పాఠమిది. ఈ పాఠాన్ని జీవితాంతం ఆయన ఆచరించారు.
విలువలకు, నిజాయతీకి మారుపేరైన అబ్దుల్ కలాం ఇతరుల నుంచి ఏనాడూ కానుకలు ఆశించలేదు. ఎవరైనా ఇలాంటివి ఇస్తే దాని ధర ఎంతో తెలుసుకొని చెక్కు లేదా డబ్బులు పంపించేవారు. మిస్సైల్ మ్యాన్ కలాం గొప్పతనాన్ని తెలియజేసే మరో సంఘటన వెలుగులోకి వచి్చంది. కలాంకు సంబంధించిన ఈ ఉదంతాన్ని ఐఏఎస్ అధికారి ఎం.వి.రావు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2014లో కలాం ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే సంస్థ ఆయనకు ఒక గ్రైండర్‌ను బహూకరించింది. దాన్ని స్వీకరించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. చివరకు బలవంతం మీద స్వీకరించారు. ఆ మరుసటి రోజే దాని ధర తెలుసుకొనేందుకు తన సహాయకుడిని మార్కెట్‌కు పంపించారు. తర్వాత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి చెక్కును సౌభాగ్య సంస్థకు పంపారు. చెక్కును ఆ సంస్థ నగదుగా మార్చుకోకపోవచ్చన్న అనుమానం ఆయనకు వచ్చింది.
తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందో లేదో కనుక్కున్నారు. కాలేదని తెలిసింది. గడువులోగా నగదుగా మార్చకోకపోతే గ్రైండర్‌ను వెనక్కి ఇచ్చేస్తానని సౌభాగ్య సంస్థకు కలాం సమాచారం పంపారు. ఇక చేసేది లేక ఆ సంస్థ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసి, డబ్బులు తీసుకుంది. అబ్దుల్ కలాం ఇచ్చిన చెక్కును జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకుంది. ఎం.వి.రావు షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కలాం వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment