missileman
-
నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి
న్యూఢిల్లీ: ‘ఇతరులు ఇచ్చే కానుకలు, బహుమానాల వెనుక స్వార్థపూరిత కారణం ఉండొచ్చు. మన నుంచి ఏదో ఒకటి ఆశించి ఇలాంటివి ఇస్తుంటారు. అది స్వీకరించే ముందు ఈ విషయం ఆలోచించాలి’.. ప్రఖ్యాత సైంటిస్ట్, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బాల్యంలోనే తన తండ్రి వద్ద నేర్చుకున్న పాఠమిది. ఈ పాఠాన్ని జీవితాంతం ఆయన ఆచరించారు. విలువలకు, నిజాయతీకి మారుపేరైన అబ్దుల్ కలాం ఇతరుల నుంచి ఏనాడూ కానుకలు ఆశించలేదు. ఎవరైనా ఇలాంటివి ఇస్తే దాని ధర ఎంతో తెలుసుకొని చెక్కు లేదా డబ్బులు పంపించేవారు. మిస్సైల్ మ్యాన్ కలాం గొప్పతనాన్ని తెలియజేసే మరో సంఘటన వెలుగులోకి వచి్చంది. కలాంకు సంబంధించిన ఈ ఉదంతాన్ని ఐఏఎస్ అధికారి ఎం.వి.రావు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2014లో కలాం ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే సంస్థ ఆయనకు ఒక గ్రైండర్‌ను బహూకరించింది. దాన్ని స్వీకరించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. చివరకు బలవంతం మీద స్వీకరించారు. ఆ మరుసటి రోజే దాని ధర తెలుసుకొనేందుకు తన సహాయకుడిని మార్కెట్‌కు పంపించారు. తర్వాత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి చెక్కును సౌభాగ్య సంస్థకు పంపారు. చెక్కును ఆ సంస్థ నగదుగా మార్చుకోకపోవచ్చన్న అనుమానం ఆయనకు వచ్చింది. తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందో లేదో కనుక్కున్నారు. కాలేదని తెలిసింది. గడువులోగా నగదుగా మార్చకోకపోతే గ్రైండర్‌ను వెనక్కి ఇచ్చేస్తానని సౌభాగ్య సంస్థకు కలాం సమాచారం పంపారు. ఇక చేసేది లేక ఆ సంస్థ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసి, డబ్బులు తీసుకుంది. అబ్దుల్ కలాం ఇచ్చిన చెక్కును జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకుంది. ఎం.వి.రావు షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కలాం వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు. -
కొత్త బాధ్యతలు స్వీకరించిన సతీశ్ రెడ్డి
న్యూఢిల్లీ: డీఆర్డీఓ (రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ) చైర్మన్‌గా ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, తెలుగు తేజం జి.సతీశ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో డీఆర్డీఓ వెల్లడించింది. ఆయన రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగానికి కూడా కార్యదర్శిగా పనిచేస్తారు. 1985లో డీఆర్డీఓలో తన ప్రస్థానం ప్రారంభించిన సతీశ్‌రెడ్డి 1986–94 మధ్యకాలంలో క్షిపణి నేవిగేషన్(దిక్సూచి) వ్యవస్థలో అనేక మైలురాళ్లను ఆధిగమించారు. శాస్త్ర సలహాదారుగా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్, ఎవియానిక్స్ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇంతవరకూ ఆయన రక్షణ శాఖ మంత్రి శాస్త్ర సలహాదారుగా పనిచేశారు. -
‘మిస్సైల్‌మ్యాన్’కు నివాళి
నల్లగొండ టూటౌన్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బుధవారం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్లో గల అమరవీరుల స్థూపం వద్ద కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగార్జున, నాయకులు యుగంధర్, అంబేద్కర్, విజయ్, హరీశ్, క్రాంతి, కిరణ్, రాజేశ్, రాంబాబు, యాదగిరి తదితరులున్నారు. ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్ కళాశాలలో.. కనగల్ : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హరినాథరెడ్డి అన్నారు. మండలంలోని చర్లగౌరారం పరిధిలో గల కళాశాలలో మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడారు. దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయిందన్నారు. కలాం ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మాల దయాకర్‌రెడ్డి, హెచ్ఓడీలు మధు, రవికుమార్, హైమావతి, శ్రీనివాస్‌కుమార్, గిరీశ్‌కుమార్, టీపీఓ శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.