ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న నలభై ఒక్క మంది కార్మికులను వెలుపలికి తీసు కొచ్చేందుకు పనులు జరుగు తున్నప్పటకీ ఈ ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. శుక్రవారం అంతరాయం తరువాత అమెరికాఅగర్ డ్రిల్లింగ్ మెషిన్ సాయంతో డ్రిల్లింగ్ కార్యక్రమం తిరిగి కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో వారంతా క్షేమంగా బయటకు రావచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
అయితే ఈ ప్రక్రియలో సవాళ్లను బట్టి 15 రోజుల వరకు పట్టవచ్చని కేంద్రం తెలిపింది. ప్రస్తుత ప్లాన్ వర్క్ అవుట్ కాపోతే మరో ఐదు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశామని ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ మరో 15 రోజులు అయినా కూడా సాగుతుందన్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడి సహాయక చర్యలను పరిశీలించారు.
మరో 12 -15 రోజులు
రోడ్డు రవాణా మరియు హైవేస్ సెక్రటరీ అనురాగ్ జైన్ మాట్లాడుతూ డ్రిల్లింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఇదే సరియైన పద్ధతి. దీనికితోడు తాము మరో ఐదు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధంగా ఉంచామని, అయితే వాటికి 12-15 రోజులు పట్టవచ్చని జైన్ చెప్పారు. ఒక ఆప్షన్‌కోసమే వెయిట్ చేయకుండా, ఏకకాలంలో అన్ని ప్లాన్లపైనా పని చేస్తున్నామని వెల్లడించారు. సొరంగానికి సమాంతరంగా అగర్, క్షితిజ సమాంతర బోరింగ్ సాయంతో ప్రస్తుతం మైక్రో టన్నెల్ నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే దీనికి 12-15 రోజులు పట్టవచ్చని కూడా తెలిపారు.
వెజ్ పులావ్, మటర్ పనీర్
వారికి గత రాత్రి వెన్నతో వెజ్ పులావ్, మటర్ పనీర్, చపాతీలతో కూడిన భోజనం అందించామన్నారు. ఆహారం 6-అంగుళాల పైప్‌లైన్ ద్వారా పంపిణీ చేశామని, అలాగే పండ్లు, ఇతర అత్యవసరవస్తువులను అందించామని కూడా చెప్పారు. ఈనేపథ్యంలోనే పెద్ద మొత్తంలో ఘనమైన ఆహారం, నీటిని పంపడానికి అధికారులు 57 మీటర్ల పొడవు, 6 అంగుళాల వెడల్పు గల పైపును ఏర్పాటు చేశారు. దీని ద్వారా కార్మికులకు వేడి ఆహారాన్ని అందిస్తున్నామని జైన్ వెల్లడించారు.
అలాగే సైట్‌కు చేరుకున్న వైద్యులు, యోగా చేయాలని, వాకింగ్ లాంటి చిన్నపాటి వ్యాయామం చేయాలని, ఒకరితో ఒకరు మాట్లాడు కుంటూ ఉండాలని చిక్కుకున్న కార్మికులకు సూచించారు. కార్మికులతో సంభాషించిన 30 సెకన్ల వీడియోను అధికారులు విడుదల చేశారు. కాగా ఈ నెల (నవంబర్) 12 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 4.5 కిలోమీటర్ల సొరంగంలో కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment