అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు 8 ఆస్పత్రులకు మెయిళ్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆగంతకుల బాంబు బెదిరింపులు మరోసారి కలకలానికి కారణమయ్యాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)తోపాటు ఎనిమిది ఆస్పత్రులకు ఈ–మెయిల్ హెచ్చరికలు అందాయి. మే ఒకటో తేదీన దేశ రాజధాని పరిధిలోని 150కి పైగా స్కూళ్లకు కూడా ఇదేవిధంగా బెదిరింపు మెయిళ్లు అందడం, పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం అవన్నీ వట్టివేనని తేలడం తెల్సిందే.
ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఐజీఐ టెరి్మనల్–3లో బాంబులు పెట్టినట్లు మెయిల్ అందడంతో తనిఖీలు చేపట్టారు. భారీగా పోలీసులను మోహరించారు. అంతకుముందు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీ ప్రాంతంలోని 8 ఆస్పత్రులకు బెదిరింపులు అందాయి. అదేవిధంగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ అందింది. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆయాచోట్లకు ఫైరింజన్లను పంపించారు.
బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసు బృందాలు పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టాయి. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదని ఢిల్లీ నార్త్‌జోన్ డీసీపీ ఎంకే మీనా చెప్పారు. బురారీ ఆస్పత్రి, సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్, దాదాదేవ్ హాస్పిటల్, గురు తేజ్ బహదూర్ హాస్పిటల్, బారా హిందూరావ్ హాస్పిటల్, జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి, అరుణా అసఫ్ అలీ గవర్నమెంట్ ఆస్పత్రులకు ఈ బెదిరింపులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment