సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరి నుంచి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో భారత్ తాత్కాలిక శాశ్వత సభ్య దేశం కానుండటంతో ఐక్యరాజ్యసమితిలో తన వాణిని బలంగా వినిపించేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. యూఎన్‌ఎస్‌సీ వ్యవహారలను సమన్వయం చేసేందుకు ఓ కౌన్సెలర్‌ను నియమించడంతో పాటు యూఎన్‌ఎస్‌సిలో భారత్ పనితీరును విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రతి నెలా స్వయంగా సమీక్షిస్తారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో 1999 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి ఆర్ రవీంద్రన్‌ను సంయుక్త కార్యదర్శిగా భారత్ నియమించింది. ఇక 2007 ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రతీక్ మాధుర్ యూఎన్‌ఎస్‌సీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కౌన్సెలర్‌గా నియమితులయ్యారు. రవీంద్రన్‌కు గతంలో యూఎన్‌పీఆర్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 2011-12లో భారత్ ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న సమయంలో భారత మిషన్‌కు నేతృత్వం వహించిన ప్రస్తుత పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి నాయకత్వంలో యూఎన్‌పీఆర్‌లో రవీంద్రన్ సేవలందించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఇటీవల ఎనిమిదోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఓటింగ్‌లో సర్వ ప్రతినిధి సభలోని 193 దేశాల్లో 184 దేశాలు భారత్‌కు మద్దతు పలికాయి. భారత్ విజయం సాధించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ ప్రపంచ శాంతి, భద్రత, సమానత్వ భావనలను ప్రోత్సహించేందుకు సభ్యదేశాలతో కలిసి భారత్ పనిచేస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. యూఎన్‌పీసీలో భారత్ 2021 జనవరి నుంచి రెండేళ్లపాటు తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమవుతున్న క్రమంలో అత్యున్నత సంస్థ ఏర్పడి 75 ఏళ్లు అయిన తర్వాత శాశ్వత సభ్యత్వం కోసం ఎందుకు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయం భారత్ విస్మరించరాదని దౌత్యవేత్తలు పేర్కొంటున్నారు. చదవండి : భద్రతా మండలికి భారత్
Comments
Please login to add a commentAdd a comment